Home Page SliderNational

“ఢిల్లీని గెలుస్తాం”: ప్రాంతీయ పార్టీల సత్తా చాటుతామన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్, వామపక్షాలు కుమ్మక్కయ్యాయని ఆరోపించిన మరసటి రోజే మమత బెనర్జీ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు విషయాన్ని ప్రస్తావిస్తూ… విపక్ష నాయకులను జైల్లో పెట్టి ఎన్నికల్లో విజయం సాధించాలని కేంద్రం చూస్తోందని మమత దుయ్యబట్టారు. ‘‘ఈ దేశంలో ప్రతి ప్రతిపక్ష నేతను జైల్లో పెడతారు.. నన్ను జైల్లో పెడితే నేను బయటకు వస్తాను.. ఎన్నికల్లో గెలవడానికి అందరినీ జైల్లో పెడుతున్నారని గుర్తుంచుకోండి.. మనం దొంగలా.. వాళ్లు సాధువులా.. ఈరోజు అధికారంలో ఉన్నారు. కాబట్టి వారికి ఏజెన్సీలు ఉన్నాయి, రేపు వారు అధికారంలో ఉండరు, అన్ని ఏజెన్సీలు కనుమరుగవుతాయి, ”అని మమత మండిపడ్డారు. ప్రజలు స్థానిక పార్టీలను ఎన్నుకుంటే, వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత బీజేపీ ప్రభావం ఉండదని ఆమె అన్నారు.

రాబోయే లోక్ సభ ఎన్నికలు తర్వాత తన తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీని “గెలిచి” అన్ని ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తుందని పేర్కొన్నారు. “మా, మతి, మనుష్” (తల్లి, భూమి, ప్రజలు) ప్రధాన విలువలతో తాను రాజకీయాలు చేస్తున్నానన్నారు. బెంగాల్‌ను గెలుచుకోవడం, దాని ప్రభావాన్ని దేశ రాజధాని వరకు విస్తరించడం లక్ష్యంగా పెట్టుకున్నామని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలను ఏకం చేయాలనే తన దృక్పథాన్ని ఆమె నొక్కిచెప్పారు. “ప్రజలు మాతో ఉంటే, మేము హామీ ఇస్తున్నాము, మేము ఢిల్లీని గెలుస్తాము, ఎన్నికల తర్వాత అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకొని ఇది సాధిస్తాం” అని ముఖ్యమంత్రి బెనర్జీ అన్నారు. కాంగ్రెస్ పార్టీతో సహా పలు ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేసిన ఇండియా కూటమి, బీహార్ సీఎం నితీష్ కుమార్ యూటర్న్ తర్వాత అయోమయంలో కూరుకుపోయింది.

నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC), పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమాలతో ఓటర్లను ఒంటరిగా చేయడమే బీజేపీ లక్ష్యమని పేర్కొన్నారు. బీజేపీ రాజకీయ ప్రణాళికలను నమ్మొద్దని ఆమె ప్రజలను హెచ్చరించారు. ఎన్నికలను మానిప్యులేట్ చేయడానికి బీజేపీ ఇటువంటి చర్యలను ఉపయోగిస్తోందని ఆరోపించారు. “దయచేసి గుర్తుంచుకోండి, ఇక్కడ NRCని అమలు చేయడానికి నేను వారిని అనుమతించను, వారు CAA పేరుతో అబద్ధాలు చెబుతున్నారు. ఇవి వారి రాజకీయ ప్రణాళికలు, వారిని నమ్మవద్దు, వారు మీ అందరినీ ఒంటరిగా చేయాలనుకుంటున్నారు” అని ఆమె చెప్పారు. వామపక్షాల జోక్యం కారణంగా కాంగ్రెస్‌తో సీట్ల పంపకాల చర్చలు విఫలమయ్యాయని పేర్కొంటూ, రాబోయే ఎన్నికలలో బిజెపికి సహాయం చేయడానికి కాంగ్రెస్, వామపక్షాలు జతకట్టాయని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఆరోపించారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల బెంగాలీలకు ఎలాంటి లాభం చేకూరదని.. గల్లీలో ఉండే పార్టీకి ఓటేసినప్పుడే.. ఢిల్లీలో అధికారం దక్కుతుందని మమత బెనర్జీ తేల్చి చెప్పారు. “365 రోజులు నీతో ఉండేవాడా, లేక సీజనల్ పక్షిలా వచ్చేవాణ్ని నువ్వు ఎవరిని ఎన్నుకుంటావు? గుర్తుంచుకోండి మనం ఢిల్లీని గెలుస్తాం. ఢిల్లీని గెలిపించడానికి బెంగాల్ మార్గం చూపుతుంది. బెంగాల్‌లో ఒంటరిగా వెళ్తాం. పొత్తు పెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీని కోరినప్పటికీ ఆ పార్టీ అలా వ్యవహరించలేదని మమత విమర్శించారు. కాంగ్రెస్, సీపీఐ(ఎం)లు బీజేపీకి సహాయం చేసేందుకు పొత్తు పెట్టుకున్నాయని ఆమె ఆరోపించారు. 2019 ఎన్నికల్లో, మమత బెనర్జీ TMC 22 సీట్లు, కాంగ్రెస్ రెండు, BJP పశ్చిమ బెంగాల్‌లో 18 సీట్లు గెలుచుకున్నాయి. ఈసారి లోక్ సభ ఎన్నికలను క్లీన్ స్వీప్ చేసేలా మమత రాజకీయం చేస్తున్నారు.