ఆదాని ఇచ్చిన డబ్బుని వెనక్కిచ్చేస్తున్నాం
గత కొద్ది రోజుల జరుగుతున్న ఆదాని వ్యవహారం రాద్దాంతం నేపథ్యంలో.. తెలంగాణకు ఆదాని ఇచ్చిన రూ.100కోట్లను వెనక్కి ఇచ్చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.ఈ మేరకు జూబిలీ హిల్స్‌లో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆదాని డబ్బు తెలంగాణకు వద్దన్నారు.ఇందులో భాగంగా ఆదివారం ఆదానికి లేఖ రాశామన్నారు. తన ఢిల్లీ టూర్ పై కొంత మంది అవాకులు చెవాకులు పేలుతున్నారని మాజీమంత్రి కేటిఆర్ ని ఉద్దేశ్యించి పరోక్షంగా విమర్శించారు.సాగునీటి ప్రాజెక్టులు, మెట్రో విస్తరణ వంటి అంశాలకు సంబంధించి నిధుల సాధన కోసం తాను తరచూ ఢిల్లీ వెళ్ళక తప్పదన్నారు.దీన్ని బూతద్దం లో చూపించి కొందరు తప్పుతోవ పట్టిస్తున్నారన్నారు.ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని అది తెలంగాణ ప్రజల అవసరమన్నారు.ఓంబిర్లా కూతురు పెళ్లి మంగళవారం జరగనుందని ,అక్కడకి వెళ్తుంటే ఢిల్లీ పెద్దల కోసం వెళ్తున్నారని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రస్తుతం జరగుతున్న పరిణామాల నేపథ్యంలో స్కిల్ యూనివర్సిటికి ఆదాని ఇచ్చిన రూ. 100 కోట్లను తిరిగి ఇచ్చేస్తున్నామన్నారు.