NationalNews

ఇదేం భాష.. ఇదేం ప్రయోగం.. తల్లడిల్లిన తెలుగు తల్లి


భాష మారుతోంది. మాట తడబడుతోంది. విమర్శల శబ్దాలు వికృతంగా మారుతున్నాయి. ఆరోపణలు అంద విహీనమవుతున్నాయి. అపశబ్దాల ధాటి పెరుగుతోంది. అలవాటుగా మారుతోంది. సామాజక మాధ్యమాలలో చెలరేగాలంటే .. ఒకరిని తిట్టాలి. ఆ తిట్టు ఘాటుగా ఉండాలి. అందరికీ ఎక్కాలి. అందరూ చూడాలి. ఇదే ఇప్పుడు రాజకీయ నాయకులకు అనుసరణీయంగా మారింది. ఆచరణ అయ్యింది. విజ్ఞత, వినయం, సంస్కారం, సంప్రదాయం, గౌరవం వంటి అర్ధాలు మారిపోతున్నాయి. నిందలు.. నిష్టూరాలు బూతులతో మిళితమవుతున్నాయి. అరేయ్.. తురేయ్ అనే భాష పదునెక్కి .. పెదవి దాటి చెలరేగుతోంది. ఒకరిని చూసి మరొకరు. వారిని చూసి ఇంకొకరు.. ఇలా బూతు భాషా ప్రావీణ్యతను చాటుకుంటున్న వారు ఎక్కువవుతున్నారు. అధినేతలను ఆకర్షించేందుకు అదే సరైన మార్గమనుకుంటున్నారు.


భాషను దిగజార్చేస్తున్నారు. అక్షరాలు కూడా సిగ్గుపడేలా .. ఛీ అనేలా చేస్తున్నారు. పదాలను నిస్సిగ్గుగా ప్రయోగించేస్తున్నారు. గౌరవాలను తుడిచి అవతల పారేస్తున్నారు. ఇప్పుడంతా అపశబ్దాలే రాజ్యమేలుతున్నాయి. అపభ్రంశ పదాలకే పట్టం కడుతున్నారు. ఎవరినేతై రోల్ మోడల్ గా భావిస్తారో.. ఎవరైతే భవి తరాలకు మార్గదర్శకులుగా మారాలనుకుంటురో వారంతా ఇప్పుడు స్టైల్ మార్చారు. వికృతత్వాన్ని తమ భాషలో చొప్పించి . ఎదుటి వారిని దూషించే నైజాన్ని పెంచుకుంటున్నారు. భాషను గాడి తప్పించి .. కొత్త భాషను ప్రవేశ పెడుతున్నారు. వినడానికి కూడా సంకోచించే.. సంశయించే పదాలను ప్రయోగిస్తూ ఎదుటి వారిని తూలనాడే భావ ప్రకటనను తెరపైకి తెస్తున్నారు. ఎక్కడ చూసినా.. ఎవరిని చూసినా ఇప్పుడు ఇదే కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఎదుగుతున్న వారు.. కొత్తగా అరంగేట్రం చేస్తున్న వారు అనుసరిస్తున్నది ఇదే మార్గం.


బహిరంగ సభలే కాదు. మీడియా సమావేశాలే కాదు. చట్ట సభలలో కూడా ఇదే భాష.. ఇదే ఒరవడి. ఇదే ప్రవర్తన పెరుగుతోంది. నిన్నటికి నిన్న దేశ అత్యున్నత చట్ట సభ కూడా ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉభయ పార్లమెంట్ సభలలో కొన్ని పదాల వాడకాన్ని నిషేధించింది అంటే .. భాషకు పట్టిన గతి అవగతమవుతుంది. పూర్వం ఉన్న సంస్కారవంతమైన రాజకీయాలు ఇప్పుడు మచ్చుకు ఎక్కడా కనపడని పరిస్ధితి. వెలుగు చూసినవి కొన్ని .. వెలుగులోకి రానివి కొన్ని. కానీ.. నిత్యం చూస్తున్నవి.. వింటున్నవి ఎన్నో. విపక్షంలో ఉన్న వారు సరే.. అధికారంలో ఉన్న వారు జాగ్రత్తగా అడుగలు వేయాల్సి ఉంటుంది. ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. మళ్ళీ జనం మనసులను గెలిచి అధికారంలోకి రావాలని కోరుకుంటారు కాబట్టి ఆ దిశగా ఆలోచించాల్సి ఉంటుంది. కానీ.. అవేమి పట్టించుకునే భావన ఎవరిలోనూ కనిపించడం లేదు. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అన్ని పార్టీలలో ఇదే ధోరణి. అందరి నేతల్లో ఇదే భావన. ఎవరో ఒకరిద్దరు మినహా అందరిదీ ఒకటే భాష.


రెండు రోజులుగా చూస్తున్న పరిణామాలైతే తీవ్ర ఆందోళన రేపుతున్నాయి. మహారాష్ట్రలో అధికార షిండే వర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మేల్యేలు వాడిన భాష సభ్య సమాజం సిగ్గు పడేలా ఉంది. ఇక ఏపీ రాజకీయాలలో భాష ఎప్పుడో వక్రగతిలోకి మళ్ళింది. అరేయ్.. తురేయ్ వంటి పదాలు అలవాటుగా మారాయి. వాడు.. వీడు అంటూ బూతులు ప్రయోగిస్తూ .. తిట్టుకుంటున్న వైనం అధికమైంది. ఇందులో ఎవరిని నిందించాలి.. ? ఎవరిని తప్పుబట్టాలి.. ? భాషను ఖూనీ చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ? ఎవరు చర్యలు తీసుకోవాలి.. ? అసలే ఉన్న 56 తెలుగు అక్షరాలో ఎన్నో మాయమై పోయాయి. ఇప్పుడు కొత్త సమస్య. భాషకే ప్రమాదం వాటిల్లే సమస్య. మర్యాద మన్ననలను తుడిచేసే సమస్య. దీనిపై దృష్టి పెట్టక పోతే రానున్న రోజులను ఊహించడం కూడా కష్టమే.