విజయవాడలో వరుణుడి విలయతాండవం
ఎన్నడూ లేని విధంగా విజయవాడలో వరుణుడు విలయతాండవం చేశాడు. ఎడతెరిపి లేకుండా 3 రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాలకు బెజవాడ గజగజలాడింది. విజయవాడలోని కాలనీలన్నీ నీటమునిగాయి. లక్షలాది మంది ముంపులో చిక్కుకున్నారు. ఆహారం, నీరు లేక ఆర్తనాదాలు చేశారు. అనేక ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. దీనికి తోడు బుడమేరు పొంగిపొర్లి నగరంపై విరుచుకుపడింది. శనివారం మొదలైన వరద, ఆదివారం తెల్లవారేసరికి విజయవాడ వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలను ముంచెత్తింది. దాదాపు 3 లక్షల మంది ప్రజలు నిత్యావసరాలకు విలవిల్లాడారు. ఆరడుగుల మేర ఇళ్లన్నీ నీటమునిగి దారుణమైన స్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి వరద ప్రాంతాలను పర్యవేక్షించారు. పడవలో ముంపు ప్రాంతాలను పరిశీలించి, కాలనీల ప్రజలకు భరోసా ఇచ్చారు. మంత్రులు, అధికారులు నగరంలోని పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు. అనేకమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

విజయవాడలోని సింగ్ నగర్, వాంబే కాలనీ, రారాజేశ్వరీ పేట, గొల్లపూడి రామరాజ్య నగర్, హౌసింగ్ బోర్డు , జక్కంపూడి ప్రాంతాలలో బుడమేరు వరద పోటెత్తడంతో రాకపోకలు స్తంభించాయి. ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ వరద నీరు చేరడంతో విద్యుత్ సరఫరా ఆపేశారు. దీనితో పలు ప్రాంతాలు చీకట్లో మగ్గుతున్నాయి. విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే పలు మార్గాలలో 120 రైళ్లను రద్దు చేశారు. కొన్ని దారి మళ్లించారు. విజయవాడ-కొండపల్లి మధ్య రైల్వేట్రాక్ దెబ్బతింది. శివార్లలోని రాయనపాడు స్టేషన్ పూర్తిగా నీట మునిగింది. ఈ బుడమేరు వరదకు కారణం వెలగలేరు వద్ద షట్టర్లను ఎత్తి దిగువకు నీరు వదిలారని, ఈ ప్రభావంతో విజయవాడ నగరంపై పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ షట్టర్లు వదలక పోతే ఎన్టీటీపీఎస్ ప్లాంటులోకి నీరు చేరుతుందని భయంతో శనివారం రాత్రికి రాత్రి షట్టర్లు ఎత్తినట్లు చెప్తున్నారు.