Andhra Pradesh

ఏపీలో భారత్ జోడో యాత్రకు అనూహ్యస్పందన

◆ వేల సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ అభిమానులు
◆ పోలీస్ ఆంక్షలు తో ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు
◆ అనంతలో రాహుల్ కు బ్రహ్మరథం
◆ జోడయాత్రలో పాల్గొన్న రఘువీరారెడ్డి
◆ నడబల్లారికి చేరిన జోడోయాత్ర

కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర శుక్రవారం ఉదయం ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హిరోహోల్ మండలం జాజరకల్లు గ్రామం వద్ద ప్రవేశించింది. యాత్రలో వేల సంఖ్యలో కాంగ్రెస్ అభిమానులు పాల్గొన్నారు. బళ్లారి బెంగళూరు జాతీయ రహదారిపై యాత్ర కొనసాగింది. రాష్ట్ర సరిహద్దులోకి రాహుల్ వచ్చిన వెంటనే పిసిసి అధ్యక్షుడు డాక్టర్ శైలజనాథ్, పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రఘువీరారెడ్డి గడచిన మూడు సంవత్సరాలుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. నీలకంఠాపురంలో దేవాలయాల నిర్మాణం కారణంగా రాజకీయాల జోలికి రాలేదని ఆయన ప్రకటించారు. అయితే రాహుల్ గాంధీ జిల్లాకు రావటంతో ఆయనను గౌరవంగా ఆహ్వానించాలని వేలాది మంది కార్యకర్తలతో అక్కడికి చేరుకొని ఘన స్వాగతం పలికారు.

ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన అక్కడే బస చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కాకుండా బళ్ళారి ,తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ యాత్రకు తరలివచ్చారు. మాజీ ఎంపీలు హర్ష కుమార్, జయరామ్ రమేష్, కెవిపి రామచందర్రావు, మునియప్ప, డీకే శివ రెడ్డి, కనుమూరి బాపిరాజు రాష్ట్ర ముఖ్య నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంకు సంబంధించి చర్చించటమే కాకుండా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి సుదీర్ఘంగా రాహుల్ గాంధీ సమావేశంలో చర్చించారు. అనంతరం బసచేసిన ప్రాంతం నుంచి సాయంత్రం 5 గంటలకు రాహుల్ గాంధీ తిరిగి తన పాదయాత్రను కొనసాగించారు. డి హీరో హాల్ మండలం జాజురకల్లు, మడేనహళ్లి, లక్ష్మీపురం, ఓబులాపురం, ఓబులాపురం చెక్ పోస్ట్ మీదగా యాత్ర కర్ణాటకలోని నడబల్లారికి చేరింది. రాహుల్ గాంధీ పాదయాత్ర నేపథ్యంలో పోలీసులు పెట్టిన ఆంక్షలుతో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పాదయాత్రలో రాహుల్ గాంధీ మాట్లాడాతారని ప్రజలు రోడ్లమీద చెట్ల కింద బైఠాయించి నిరీక్షించారు. కానీ ఆయన చెయ్యి ఊపుతూ వెళ్ళిపోవటంతో ప్రజలు నిరాశకు గురయ్యారు. మరల రాహుల్ పాదయాత్ర ఈనెల 18న కర్నూలు జిల్లాలోకి ప్రవేశించనుంది.