NationalNews

ఉజ్జయినిలో ‘మహాకాల్ లోక్’

ద్వాదశ జ్యోతిర్లింగాలలో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని చాలా పురాతనమైనది, ప్రాశస్తమైనది. ఆ పరమేశ్వరుడు మహాకాళేశ్వరుని పేరుతో ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ మహాకాలుని ఆలయాన్ని భక్తులు ఏడాది పొడవునా సందర్శించి, తరిస్తూనే ఉంటారు. శివరాత్రి నాడు అయితే లక్షల సంఖ్యలో భక్తులు పోటెత్తుతారు. అలాంటి ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని గమనించి ప్రధాని మోదీ.. ఆలయ పునరుద్ధరణకు పూనుకున్నారు. కాశీ విశ్వనాథ్ కారిడార్‌ను అభివృద్ధి చేసినట్లే  ఈ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సంకల్పించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ కారిడార్ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలో పర్యాటకం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ నిర్మాణాన్ని ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు 856 కోట్ల రూపాయల వ్యయం అంచనా వేసారు. ఈ మెగా ప్రాజెక్టు పూర్తయితే ఆలయ కాంప్లెక్స్ విస్తీర్ణం 2.87 హెక్టార్ల నుండి 47 హెక్టార్ల విస్తీర్ణానికి చేరుకుంటుంది.

శ్రీ మహాకల్ లోక్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం కమల్ కుండ్, సప్తఋషి మండపం, నవగ్రహాలను కాలినడకతోనే సందర్శిస్తారు. ప్రధాని పర్యటనకు ఆలయంలో పలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దాదాపు 600 మంది కళాకారులు, సాధువులు మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలుకుతారు. కారిడార్, ప్రధాన ద్వారం వద్ద సుమారు 20 అడుగుల శివలింగం ఏర్పాటు చేశారు. అక్కడి నుండే ప్రధాని మోదీ శ్రీ మహాకాల్ లోక్ కారిడార్ ప్రారంభిస్తారు.

ఈ ప్రాజెక్టులో 108 స్తంభాలు ఉంటాయి. వీటిపై శివుని తాండవ స్వరూపం ఉంటుంది. ఈ మార్గంలో శివుడిని వర్ణించే అనేక విగ్రహాలను ఏర్పాటు చేశారు. శివపురాణంలోని కథలు, గణేశ జననం, సతి, దక్ష యజ్ఞం మొదలైన కధల కుడ్యచిత్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. శివుని విగ్రహంతో పాటు ఫౌంటెన్ కూడా ఉంటుంది. పర్యటనలో భాగంగా పూజ, దర్శనం ముగించుకుని 6.30 గంటలకు శ్రీ మహాకల్ లోక్‌ను ప్రారంభించారు. రాత్రి 7.30 కు కార్తీక మేళా మైదానంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

ఈప్రాజెక్టు ద్వారా యాత్రికుల సంఖ్య సంవత్సరానికి దాదాపు 1.5 కోట్లు దాటుతుందని అంచనా. వారసత్వ సంపద అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా ప్రపంచ స్థాయి ఆధునిక సౌకర్యాలను కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు రెండు దశల్లో పూర్తవుతుంది.