NewsTelangana

నాపై టీఆర్‌ఎస్‌ సర్కారు తప్పుడు ప్రచారం.. బిల్లులు తొక్కి పెట్టలేదు

రాష్ట్ర ప్రభుత్వం తన వద్దకు పంపిస్తున్న బిల్లులపై సంతకం చేయకుండా తొక్కి పెడుతున్నానంటూ టీఆర్‌ఎస్‌ సర్కారు తప్పుడు ప్రచారం చేస్తోందని గవర్నర్‌ తమిళి సై సౌందరరాజన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్‌భవన్‌లో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి బిల్లును తాను కూలంకశంగా పరిశీలిస్తున్నానని.. అందుకే క్లియర్‌ చేయడంలో ఆలస్యం అవుతోందని వివరణ ఇచ్చారు. కామన్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు బిల్లుకు తొలి ప్రాధాన్యత ఇచ్చానని.. కొత్త రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఎందుకో చెప్పాలని క్లారిటీ కోరానని.. అంతమాత్రాన బిల్లును ఆపేశానంటూ అసత్య ప్రచారం చేయడం సరికాదని రాష్ట్ర ప్రభుత్వానికి హితవు చెప్పారు. ఖాళీగా ఉన్న టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశానన్నారు. కొత్తగా రిక్రూట్‌మెంట్‌ బోర్డు పెడితే వచ్చే ఇబ్బందులపైనే తన ఆందోళన అని.. తెలంగాణకు న్యాయం జరగాలన్నదే లక్ష్యమని చెప్పారు. దీనిపై మంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీల్లోని మెస్‌లలో తినడానికి తిండి లేదని.. అక్కడి పరిస్థితులను మెరుగుపరచాలని ప్రభుత్వానికి సూచించారు.

నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తున్నారు..

ఫామ్‌హౌస్‌లో నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎర కేసులో రాజ్‌భవన్‌ను లాగే కుట్ర చేశారని గవర్నర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తుషార్‌ గతంలో తన ఏడీసీగా పని చేశారని.. ఇప్పుడు ఆయన పేరును ఈ వివాదంలోకి లాగారని.. గతంలో తన వద్ద పని చేసినంత మాత్రాన ఈ వివాదంలో రాజ్‌భవన్‌ను లాగుతారా..? అని ప్రశ్నించారు. రాజ్‌భవన్‌ ఎదుట ఆందోళన చేస్తామని జేఏసీ హెచ్చరిస్తోంది.. ఈ ఆందోళనకు వారిని ఎవరు పురిగొల్పుతున్నారని నిలదీశారు. 8 ఏళ్లుగా వీసీలను నియమించకుంటే ఆందోళన ఎందుకు చేయలేదో జేఏసీ చెప్పాలన్నారు. తాను పదే పదే డిమాండ్‌ చేసిన తర్వాతే వీసీలను నియమించారని గుర్తు చేశారు. ప్రగతి భవన్‌ మాదిరిగా రాజ్‌భవన్‌ గేట్లు మూసేయలేదన్నారు. రాజ్‌భవన్‌ గౌరవాన్ని దిగజార్చేందుకు టీఆర్‌ఎస్‌ సర్కారు కుట్ర చేస్తోందన్నారు. తన ఫోన్‌ను ట్యాప్‌ చేస్తున్నారనే అనుమానం కలుగుతోందని.. ఎవరొచ్చినా మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తమిళి సై చెప్పారు.