NewsTelangana

ఎంపీ అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ దాడి.. అసలేం జరిగింది!

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంటి వద్ద టీఆర్ఎస్ కార్యకర్తలు విధ్వంసానికి పాల్పడ్డారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలపై చేశారంటూ కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇంట్లోకి చొరబడి వస్తువులను ధ్వంసం చేశారు. హైదరాబాద్‌లో అర్వింద్ నివాసంపై దాడి చేసి కిటికీల అద్దాలు పగులగొట్టారు. అర్వింద్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆందోళనకు దిగారు. దాడి ఘటన సమయంలో ఎంపీ అర్వింద్ నిజామాబాద్‌లో ఉన్నారు.

కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఖర్గేతో మాట్లాడినట్టు అరవింద్ వ్యాఖ్యలు దారుణమన్నారు ఎంపీ కవిత. కాంగ్రెస్ పార్టీతో కలిసి గెలిచింది నువ్వేనంటూ ఆమె దుమ్మెత్తిపోశారు. ఇంత వరకు ఏ ఒక్కరిని కూడా తాను కలవలేదన్నారు కవిత. వ్యక్తిగతంగా తన గురించి మాట్లాడితే నిజామాబాద్ చౌరాస్తాలో చెప్పుతో కొడతానన్నారు. వచ్చే ఎన్నికల్లో వెంటబడి ఓడిస్తానన్నారు. రాజకీయాలు చేయొచ్చుగానీ.. పిచ్చి వేషాలు వేయొద్దని తంతామన్నారు కవిత. అర్వింద్ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసిన ఓడిస్తానన్నారు. ఎంతో బాధతో ఈ మాటలు మాట్లాడానన్నారు. నిజామాబాద్ పేరును అర్వింద్ పాడు చేస్తున్నాడన్నారు.

అంతకు ముందు కవితపై, అర్వింద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను బెదిరించడానికి… కవిత, కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ మల్లికార్జున ఖర్గేకు ఫోన్ చేశారన్నారు. ఈ విషయం తెలిసి కేసీఆర్, కవితను ములాయం చనిపోయినప్పుడు వెంట తీసుకెళ్లారన్నారు. కూతురు తనతోనే ఉందని చెప్పేందుకు మీడియా ముందు డ్రామా ఆడారంటూ విమర్శించారు. అదే సమయంలో కవితను బీజేపీలోకి తీసుకునే ఉద్దేశం లేదన్నారాయన. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో సంబంధముందన్న కవితకు బీజేపీలో చోటు లేదన్నారు. ఆమెను పార్టీలోకి తీసుకొచ్చేవారిని కూడా సస్పండ్ చేస్తామన్నారు.