home page sliderHome Page SliderNewsPoliticsTelanganatelangana,viral

వాహనదారులకు రవాణాశాఖ హెచ్చరిక…

తెలంగాణలోని వాహనదారులకు రవాణా శాఖ భారీ హెచ్చరిక జారీ చేసింది. మూడు నెలలకుపైగా పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను సమర్ధవంతంగా పరిష్కరించకపోతే, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు కావచ్చని స్పష్టం చేసింది. ట్రాఫిక్ నిబంధనలు పదేపదే ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 2023 డిసెంబర్‌ నుంచి 2024 జూన్‌ వరకు రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వీటిలో అధిక సంఖ్యలో కేసులు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందినవివే కావడం గమనార్హం. డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్‌లో వాహనాల నడపడం లాంటి తీవ్రమైన ఉల్లంఘనలతో పాటు, పెద్దఎత్తున పెండింగ్ చలాన్లు కూడా కీలక అంశాలుగా మారాయి. వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు వచ్చిన వెంటనే చెల్లించకుండా, నెలలు, ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉంచుతున్నారు. వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు ఎస్ఎంఎస్‌లు వచ్చినా నిర్లక్ష్యం చూపడం వల్ల ఒక్కో వాహనంపై వేల రూపాయల జరిమానాలు చేరుతున్నాయి. పోలీసుల తనిఖీల సమయంలో చలాన్ల మొత్తం కట్టలేక వాహనాన్ని అక్కడే వదిలివెళ్లిపోతున్న వైనాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడమే కాకుండా, నిబంధనలు పాటించకపోతే ఎలాంటి ప్రభావం ఉండదన్న భావనకు దారితీస్తున్నాయి. ఇది రోడ్డు భద్రతకే ముప్పుగా మారుతోంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు, వాహనదారులపై మరింత నియంత్రణ కోసం — మూడు నెలలకుపైగా పెండింగ్‌లో ఉన్న ఫైన్లు ఉంటే సంబంధిత వాహనదారుల లైసెన్సును సస్పెండ్ చేయాలనే ప్రతిపాదనను రవాణా శాఖకు పంపించారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై రవాణా శాఖ ఉన్నతాధికారులు చర్చల ద్వారా, సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసి త్వరలోనే ప్రభుత్వానికి నివేదించనున్నారు. ఈ కొత్త చర్యలు అమలయితే , వాహనదారులు ఫైన్లను సమయానికి చెల్లించేందుకు సిద్దపడతారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయం సమకూరడమే కాకుండా, రోడ్డు భద్రత మెరుగవుతుంది. ట్రాఫిక్ నియంత్రణలో పారదర్శకత పెరుగుతుందని, నిబంధనలు పాటించే వాతావరణం నెలకొనడం ద్వారా వాహన ప్రమాదాల సంఖ్య కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.