ఓట్లను తెలంగాణకు బదిలీ చేసుకోండి.. మంత్రి హరీశ్ సూచన
తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తెలంగాణలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలని తెలంగాణ ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు సూచించారు. ఇక్కడ స్థిరపడిన ఆంధ్రా కార్మికులు ఆంధ్రప్రదేశ్‌లో తమ ఓట్లను రద్దు చేసి తెలంగాణలో ఓటర్లుగా నమోదు చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, పొరుగు రాష్ట్ర కార్మికులు తమ ఓట్లను బదిలీ చేసుకోవాలని హరీశ్ విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో మేస్త్రీ సంఘం భవన్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది తెలంగాణలో స్థిరపడ్డారు. ఆంధ్ర ప్రదేశ్ నుండి చాలా మంది ఉన్నారు. మీరు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రెండింటికీ తేడా చూడాలన్నారు. ఏపీలో రోడ్లు, ఆసుపత్రుల పరిస్థితి మీకు తెలుసనన్న హరీశ్, మీకు అక్కడ ఓట్లు ఎందుకు అని ప్రశ్నించారు. తక్షణం అక్కడ ఓట్లను రద్దు చేసుకొని, ఇక్కడ నమోదు చేసుకోండని కోరారు.

తెలంగాణ పట్టణాలు, పల్లెల అభివృద్ధికి చెమటోడ్చేవారంతా తెలంగాణ బిడ్డలేనని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారని హరీశ్ గుర్తు చేశారు. మేడే రోజున సీఎం కేసీఆర్ వారికి శుభవార్త ప్రకటిస్తారని ఆర్థిక మంత్రి తెలిపారు. ప్రతి జిల్లాలో రూ.2 కోట్లతో ఎకరం విస్తీర్ణంలో కార్మిక భవన్ నిర్మిస్తామన్నారు. మేడే రోజున ఈ భవనాలకు శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ నుంచి వలస వచ్చిన ప్రజల ఓట్లు బీఆర్ఎస్ వైపునకు తిప్పుకునేలా మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలు కన్పిస్తున్నాయి. కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి దాదాపు 40 లక్షల మందికి పైగా ప్రజలు తెలంగాణలో స్థిరపడినట్లు అంచనాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాలు గణనీయమైన సంఖ్యలో సెటిలర్లు ఉన్నారు. చాలా మంది నిర్మాణ రంగ కార్మికులుగా ఉన్నారు.