News

ఉద్యోగులతో చాయ్ బిస్కెట్ సమావేశం

◆ ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
◆ సీపీఎస్ చర్చల పేరుతో రప్పించి అక్కడ జీపీఎస్ ప్రతిపాదన
◆ పాదయాత్ర హామీని నిలబెట్టుకోవాలని అంటున్న ఉద్యోగ సంఘాలు
◆ నిధులు లేక ఇరకాటంలో వైసీపీ ప్రభుత్వం

ఎన్నికల ముందు పాదయాత్రలో వైఎస్ జగన్ హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేయాల్సిందేనని ఉద్యోగ సంఘాలు పట్టుబడుతున్నాయి. ఉద్యోగ సంఘాలకు మద్దతుగా టీడీపీ, జనసేన,బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలు కూడా సీపీఎస్ రద్దు చేయాలని వైసీపీపై ఒత్తిడి తెస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల కంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీం మీద ప్రజలలో చర్చ జరుగుతోంది. వెంటనే సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అందుకోసం దఫ దఫాలుగా ఉద్యమాలను కూడా నిర్వహిస్తున్నాయి. భవిష్యత్తులోనూ ఉద్యమాలకు సిద్ధపడుతున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీరు మారటం లేదు నిధులు లేని కారణంగా కానీ మరి ఏదైనా ఇతర కారణాలతో కానీ పదేపదే సీపీఎస్ చర్చల పేరీట ఉద్యోగ సంఘాల నేతలను మంత్రుల కమిటీ బృందం రప్పించుకొని అక్కడ సీపీఎస్ కాకుండా గ్యారెంటీ పెన్షన్ స్కీమ్ (జీపీఎస్) పల్లవి అందుకోవటం పరిపాటిగా మారింది.

ఈనెల 1వ తేదీన సీఎం నివాసం ముట్టడి చలో విజయవాడకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అప్పటినుంచి మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణతో కూడిన కమిటీ ఉద్యోగ సంఘాలను చర్చలకు రెండు విడుతలగా పిలిపించింది. కానీ పేరుకు సీపీఎస్ పేరుతో రప్పించి అక్కడ జీపీఎస్ ప్రతిపాదన తేవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకటో తేదీన చలో సీఎం నివాసం చలో విజయవాడకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో జగన్ సర్కార్ ఉక్కిరి బిక్కిరి అయింది. ఒకవైపు ఆయా ఉద్యోగ సంఘాలతో చర్చలు, మరోవైపు ఉద్యమం అణచివేతపై చర్యలు ఆరంభించింది. సీపీఎస్ నేతలు ఉద్యోగులకు నోటీసులు జారీపై బైండోవర్ కేసులు నిర్బంధాలు… బెదిరింపు చర్యలకు కూడా ప్రభుత్వం పాల్పడింది. చలో విజయవాడకు తరలిరాకుండా ఉపాధ్యాయులపై ముందస్తుగా పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో ఉద్యమానికి అనుకూల పరిస్థితులు లేనందున ఈ నెల 11వ తేదీకి సీఎం ఇంటి ముట్టడి చలో విజయవాడ కార్యక్రమాలను ఉద్యోగ సంఘాల నేతలు మార్పు చేశారు.

తాజాగా మంగళవారం విజయవాడ ఇరిగేషన్ అతిధి గృహంలో మంత్రులు బుగ్గన, బొత్సలతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. సీపీఎస్ రద్దుపై మంత్రులు ప్రస్తావించకుండా జీపీఎస్ అంశాన్ని పదేపదే ప్రస్తావించడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేవలం ఉద్యోగులతో ప్రభుత్వం చాయ్ బిస్కెట్ సమావేశాలు నిర్వహిస్తుందని… పదేపదే చర్చలకు ఆహ్వానించి సీపీఎస్ రద్దుపై సాగదీస్తున్నారని వారు విమర్శలు గుప్పించారు. బుధవారం కూడా ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చలు కొనసాగనున్నాయి. మంత్రుల కమిటీతో జరిగే చర్చలకు రావాలని 20 ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఆహ్వానం పంపింది. మరి ఈ సమావేశంలో అయినా సీపీఎస్ రద్దుపై ఒక స్పష్టత వస్తుందా ? లేక జీపీఎస్ అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తుందా అనేది వేచి చూడాలి.