భారత టెక్నాలజీ రంగానికి గడ్డుకాలం -టెకీలకు విషమపరీక్ష
భారత టెక్నాలజీ రంగంలో సలహాలు, సూచనలు అందించే ప్రఖ్యాత సంస్థ నాస్‌కామ్ భారత టెక్ వృద్ధి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో సరిపడే నైపుణ్యాలు కరువయ్యాయని, విద్యావ్యవస్థ ఉపాధి శిక్షణపై దృష్టి పెట్టలేదని పేర్కొంది. దీనివల్ల ఫ్రెషర్స్ శిక్షణకు కంపెనీలు అధిక సమయం ఇవ్వాల్సి వస్తోందని పేర్కొంది. ద్రవ్యోల్బణం కట్టడికి కేంద్రబ్యాంకులు వడ్డీరేట్లు పెంచడం, ఆర్థిక మాంద్య భయాలు ఫలితంగా టెక్ రంగం తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యిందని తెలిపింది. భవిష్యత్‌లో ఐటీ కంపెనీలు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగవచ్చని, మార్కెట్లో టెక్నాలజీకి గిరాకీ తగ్గుతోందని నాస్‌కామ్ ప్రెసిడెంట్ దేవయాని ఘోష్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత టెక్నాలజీ వృద్థి 8.4 శాతం తగ్గి 245 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నాస్‌కామ్ అంచనాలు వేసింది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కూడా ద్రవ్యోల్భణం అకస్మాత్తుగా పెరిగిపోవడానికి ముఖ్య కారణమైందని పేర్కొంది.