దేశ సేవకు అంకితమైన ఆర్ఎస్ఎస్
కచ్చితంగా 97 ఏళ్ల క్రితం కొత్త ఐడియా చిగురించింది. దేశాన్ని ఒక్కటిగా చేయాలని భావించింది ఆ ఆలోచన. ప్రజలను ప్రజలుగా ఉంచాలనుకుంది. దేశం కోసం నిలిచిపోరాడాలన్న భావన కలిగించింది. డాక్టర్ కేశవరావ్ బలిరామ్ హెగ్డేవర్ నాగపూర్ వేదికగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్‌ను ప్రారంభించారు. సెప్టెంబర్ 27, 1925న ఆర్ఎస్ఎస్ స్థాపన విజయదశమి పర్వదినం రోజున జరిగింది. నాటి నుంచి దసరా రోజున ఆర్ఎస్ఎస్ ఫౌండేషన్ డేను జరుపుకుంటారు. హిందూ సమాజాన్ని రక్షించడంతోపాటు, ఒక్కటి చేసే లక్ష్యంతో ఆయన నాడు వేసిన అడుగులు ఇప్పుడు వందేళ్ల దిశగా అడుగులు వేస్తున్నాయ్. నాటి ఎందరో మహానుభావులు త్యాగఫలాలు నేడు దేశం సంఘటితంగా ఉండటానికి కారణమయ్యింది.

హిందూ సమాజాన్ని ఏకం చేయడం, బలోపేతం చేయడమన్న లక్ష్యాలతో ఆర్ఎస్ఎస్ పనిచేసింది. నాటి రోజుల్లో అది ఎంతో కీలకం. కానీ నేడు పరిస్థితులు ఎంత మాత్రం అలా లేవు… సంక్షోభ సమయాల్లో దేశ ప్రయోజనాల కోసం ఆర్ఎస్ఎస్ గట్టిగా నిలబడింది. విభజన సమయంలో RSS కార్యకర్తలు హిందూ శరణార్థుల పునరావాసానికి చేదోడువాదోడుగా నిలిచారు. నాడు ఇండియాకు కాబోయే రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుస్సేన్… ఆర్ఎస్ఎస్ గురించి 1949లో కీలక వ్యాఖ్యలు చేశారు. RSS ముస్లింలపై హింస, ద్వేషం కలిగిస్తోందన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని… ముస్లింలు RSS నుండి పరస్పర ప్రేమ, సహకారం అందిపుచ్చుకోవాలన్నారు. 1962లో చైనాపై యుద్ధ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ చురుగ్గా సహకరించింది. ఇది ప్రధానమంత్రి నెహ్రూను ఆకట్టుకుంది, 1963లో న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్‌లో స్వయంసేవక్‌తో కూడిన బృందాన్ని రంగంలోకి దింపాలని RSSని ఆయన ఆహ్వానించారు.

1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రికి సహాయం చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. శాస్త్రి అప్పటి ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఎంఎస్ గోల్వాల్కర్‌ను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు తొలిసారిగా రక్తదానం చేసి సైన్యానికి అండగా నిలిచారు. RSS సేవలను దేశం చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటుందని ఫీల్డ్ మార్షల్ కారిసప్ప కీర్తించారు. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం రహస్యంగా పని చేయడంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు. అంతకుముందు ఆర్‌ఎస్‌ఎస్‌ని తీవ్రంగా విమర్శించిన జయప్రకాష్ నారాయణ్ లాంటి మేధావులు ఆర్‌ఎస్‌ఎస్ ఒక విప్లవాత్మక సంస్థ అని… దేశంలోని మరే ఇతర సంస్థ దాని దగ్గరికి ఎక్కడా రాదని…. సమాజాన్ని, కులతత్వాన్ని మార్చే సత్తా ఆర్ఎస్ఎస్‌కు మాత్రమే ఉందన్నారు.

నాటి నుంచి నేటి వరకు ఆర్ఎస్ఎస్ దేశాన్ని సంఘటితం చేయడం కోసం పనిచేస్తోంది. ఇప్పుడు భారతీయులంతా కలసికట్టుగా ఉండాలని… అందరి డీఎన్ఏ ఒక్కటేనంటూ నేటి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉద్ఘాటిస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అందరూ కలసికట్టుగా పనిచేయాలంటున్నారు. అందులో భాగంగా దేశంలోని శక్తిమంతమైన ముస్లిం సమాజానికి విభిన్న రూపాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న పలువురు మేధావులతో మోహన్ భగవత్ సమావేశమయ్యారు. ఆ సమావేశానికి కొనసాగింపుగా… ఆల్-ఇండియా-ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ డాక్టర్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇలియాసిని కలవడానికి న్యూఢిల్లీలోని మసీదుకు వెళ్లారు మోహన్ భగవత్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మసీదుకు వెళ్లడమేంటన్న చర్చ దేశమంతా అటెన్షన్ క్రియేట్ చేసింది. ఇమామ్‌తో చర్చల తర్వాత భగవత్… మదర్సా విద్యార్థులతోనూ ముచ్చటించారు. ఈ సందర్భంగా… మోహన్ భగవత్‌ను జాతిపిత అంటూ కీర్తించి పరవశించిపోయారు ఇల్యాసి. ఇప్పటివరకు మహాత్మా గాంధీని మాత్రమే ఫాదర్ ఆఫ్ ద నేషన్.. జాతిపిత అని పిలుచుకుంటుంటాం.

దేశంలోని విభిన్న మత వర్గాల మధ్య చర్చల్లో భాగమే ఈ భేటీ అంటూ ఆర్ఎస్ఎస్ క్లారిటీ ఇచ్చింది. ఇదంతా ‘సంవాద్’ లేదా సంభాషణలో భాగమని వివరించింది. నాగరిక సంవాదం దేశ సంప్రదాయాలలో ఒకటని… వాటిని తిరిగి పునర్నించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ప్రస్తుతం మన సమాజంలో ఉన్న అనేక అంశాలపై కలిసి పోరాడాలని భావిస్తే అంతకంటే మంచిదేముందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్ఎస్ఎస్ ఇప్పుడు దేశానికి ఏం కావాలన్నదానిపై శోధన చేస్తూనే ఉంది. సమాజంలోని భిన్నవర్గాలన్నీ కలిసి మెలసి జీవించాలని బలంగా కోరుకుంటోంది. గతంలో ఆర్ఎస్ఎస్‌పై కొందరిలో భిన్నాభిప్రాయాలున్నప్పటికీ అవి నేడు పటాపంచలవుతున్నాయ్.