రికార్డు స్థాయిలో తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.16 కోట్ల రూపాయలు
తిరుమల శ్రీవేంకటేశ్వరుని దేవాలయం ఎల్లప్పుడూ నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. భక్తకోటి కోట్లకొలది రూపాయల మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక వేసవిలో భక్తుల తాకిడి మామూలుగా ఉండదు. దర్శనానికి క్యూలైన్లు కిలోమీటర్ల పొడవునా ఉంటాయి. కంపార్టమెంట్లలో భక్తులు గంటలకొద్దీ వేచి ఉంటారు. అయినా ఆ దేవదేవుని దర్శనానికి బారులు తీరి దర్శనం ఎప్పుడా అని ఎదురుచూస్తూ ఉంటారు. ప్రతిరోజూ కోట్లకొలది ముడుపులతో హుండీ నిండి ఉంటుంది. తాజాగా నిన్న శ్రీవారిని దాదాపు 70 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. దీనితో నిన్న ఒక్కరోజులోనే హుండీ ఆదాయం ఎన్నడూ లేని విధంగా 5.16 కోట్ల రూపాయలు లభించింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. 27,552 మంది తలనీలాలు సమర్పించారు. 5 కంపార్టమెంట్లలో భక్తులు దర్శనానికి వేచి ఉన్నారు.

