Home Page SliderNational

అంబానీ స్కూల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్

ప్రముఖ పారిశ్రామికవేత్త,రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అయితే ఈ ఫోన్ కాల్ ఆయనకు చెందిన ధీరుభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌కు వచ్చింది. దీంతో అప్రమత్తమైన ముంబయి పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

ముంబయిలోని బాంద్రా కుర్లా ప్రాంతంలో ఉన్న ధీరుభాయ్ అంబానీ స్కూల్ ల్యాండ్ లైన్‌కు నిన్న సాయంత్రం ఈ ఫోన్ కాల్ వచ్చింది. కాగా కాల్ చేసిన వ్యక్తి స్కూల్లో టైం బాంబ్ పెట్టానని బెదిరించినట్లు తెలుస్తోంది. దీంతో స్కూల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన స్కూల్‌కి చేరుకుని తనిఖీలు చేశారు.  అయితే అక్కడ ఎటువంటి పేలుడు పదార్దాలు లభించలేదు. పోలీసులు స్కూల్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  పోలీసులు ఆగంతుకుడి నుంచి వచ్చిన ఫోన్ కాల్‌ను ట్రేస్ చేస్తున్నామని, త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని  వెల్లడించారు. అయితే గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపు కాల్స్ వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా గతంలో అంబానీ నివాసం అయిన ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్ధాలతో కూడిన స్కార్పియో కార్‌ను నిలిపి ఉంచడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత ముకేశ్ అంబానీకి,ఆయన కుటుంబ సభ్యులకు కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పిస్తోంది.