వైసీపీలో గీత దాటే నేతలకు ఇక ఉద్వాసనే!
◆ జగన్ సరికొత్త నిర్ణయం
◆ నేతలందరూ క్రమశిక్షణ పాటించాల్సిందే
◆ అధికార పక్ష నేతలలో ఆందోళన
◆ గెలుపు మాత్రమే ప్రాతిపదిక
ఏపీలో వైఎస్ జగన్ పాలనాపరంగా ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా అన్ని రకాల చర్యలు చేపట్టారు. ప్రజల సమస్యల తక్షణం పరిష్కరించే విధంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఆయన ముందుకు వెళ్తున్నారు. ఎమ్మెల్యేలు నాయకులు నిత్యం ప్రజల్లోనే ఉండాలని వారికి దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పాలనతో పాటు గడచిన నాలుగు నెలల నుండి పార్టీపై దృష్టి కేంద్రీకరించిన జగన్ అనేక నిర్ణయాలు తీసుకుంటూ రానున్న ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేలతో వర్క్ షాపు నిర్వహించిన జగన్ పార్టీలోని లోపాలను సరిదిద్దుకొని ముందుకు సాగాలని వారికి సూచిస్తున్నారు. దీంతోపాటు కొన్ని నియోజకవర్గాలలో పార్టీలోనే ఉంటూ అంతర్గతంగా పార్టీకి నష్టం చేకూరుస్తున్న నేతలపై దృష్టి సారించారు. పార్టీకి నష్టం చేకూరుస్తున్న వారు జగన్‌కు తలనొప్పిగా మారడంతో దానికి శాశ్వత పరిష్కారం చూడాలని నిర్ణయించుకున్నారు. అందుకే క్రమశిక్షణ ఉల్లంఘిస్తే వేటువేసి పార్టీ నుండి బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది.

ఈ మేరకు గడిచిన రెండు మూడు వారాలుగా చోటు చేసుకుంటున్న సంఘటనలు జగన్ ఆలోచనలను ప్రతిధ్వనిస్తున్నాయి. దీంతో అధికారపక్ష నేతల్లో ఒకింత ఆందోళన కనిపిస్తుంది. పార్టీలో ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే కచ్చితంగా వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేలా జగన్ అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు సంతృప్తి స్థాయిలో లేని చోట్ల మరో సమన్వయకర్తను నియమిస్తున్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని పార్టీ నుండి బహిష్కరిస్తున్నారు. ఇటీవల కాలంలో అమరావతి రాజధాని ప్రాంతంలో అత్యంత కీలకంగా ఉండే తాడికొండ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని పక్కనపెట్టి ఆమెకు పోటీగా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌ను సమన్వయకర్తగా నియమించారు. అక్కడ నుండి మొదలైన ఆ పరంపర వరుసగా పలుచోట్ల కనిపిస్తుంది. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య వర్గానికి గతంలో అక్కడ సమన్వయకర్తగా పనిచేసిన రావి వెంకటరమణకు మధ్య అభిప్రాయ భేదాలు నేపథ్యంలో చిన్న గొడవను సాకుగా తీసుకొని రావి వెంకటరమణను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఇలాంటి ఘటనే కృష్ణా జిల్లా పామర్రు లో కూడా జరిగింది అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే దాస్ కు ఉద్వాసన పలికారు.

ఇక ఇదే తరహాలో పలుచోట్ల జాబితాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. పార్టీ గీత దాటితే ఎవరైనా ఎంతటి వారైనా ఉపేక్షించకూడదని నిర్ణయానికి జగన్ వచ్చినట్లు తెలుస్తుంది. దీంతోపాటు నియోజకవర్గాల్లో ఎవరు బాగా పనిచేస్తున్నారు, ఎవరు ప్రజలకు దగ్గరగా ఉంటున్నారు. ఎవరు సరిగా పనిచేయడం లేదు రానున్న ఎన్నికలను ఏ నేతలైతే సమర్థవంతంగా ఎదుర్కోగలరు అనే అంశాలను కూడా జగన్ పరిశీలిస్తున్నారట. ఈ క్రమంలో ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో ఉన్న బలమైన నేతలను గుర్తించే పనిలో జగన్ పడ్డారని తెలుస్తుంది. ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పూర్తి సమాచారాన్ని తీసుకున్న జగన్ పార్టీకి వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని తొలగించి ప్రజలలో బలంగా ఉన్న నేతలను ప్రోత్సహించాలని సిద్ధమయ్యారట. 175 నియోజకవర్గాల్లో గెలవాలన్న లక్ష్యం పెట్టుకున్న జగన్… అందుకు కఠిన నిర్ణయాలు తప్పవని పార్టీ నేతలకు తేల్చి చెబుతున్నారట.