ఈ ట్రోఫీ కూడా మనదే..మాస్టర్స్ లీగ్‌లో అదరగొట్టిన టీమిండియా
అంతర్జాతీయ మ్యాచ్ ఏదైనా సరే టీమిండియా ప్లేయర్లు అదరగొడుతున్నారు. పురుషులు, మహిళలు తేడా లేకుండా క్రికెట్ భారతీయుల నరనరాలలో జీర్ణించుకుపోయిందని నిరూపిస్తున్నారు. గతేడాది టీ 20 వరల్డ్ కప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, ఇటీవల టీ20 అండర్ 19 వుమెన్స్ అన్నింట్లో సత్తా చాటుతోంది. కప్ ఏదైనా అది భారత్‌దే అన్నట్లు విజయాలు సాధిస్తున్నారు. తాజాగా సీనియర్లు కూడా తామేం తక్కువ తినలేదంటూ ఇండియా మాస్టర్స్ జట్టు ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ విజేతగా నిలిచింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని టీమిండియా సీనియర్స్ జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో వెస్టిండీస్ మాస్టర్స్‌పై ఘన విజయం సాధించింది. కేవలం 17.1 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి వెస్టిండీస్ నిర్ధేశించిన 148 స్కోరును అవలీలగా ఛేదించింది.