మాచర్లలో తీవ్ర ఉద్రిక్తత
ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్లలో శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. మాచర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి, టీడీపీ శ్రేణులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. మాచర్ల లోని మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని జూలకంటి బ్రహ్మారెడ్డి చేపట్టారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒకరికొకరు ఎదురుపడటంతో అక్కడ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో టీడీపీ నేతలు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం ప్రారంభించి ఇంటింటికి తిరుగుతూ మునిసిపల్ కార్యాలయం సమీపానికి వచ్చారు. అదే సమయంలో సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీ శ్రేణులపై కర్రలు రాళ్లు సీసాలతో దాడికి దిగారు. తమ ప్రాంతంలో తిరగటానికి వీల్లేదని హెచ్చరించారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఎదురు నిలబడ్డారు. వైసీపీ శ్రేణుల దాడులను గట్టిగా తిప్పికొట్టారు. దీంతో మాచర్ల వీధుల్లో హోరాహోరీ మొదలైంది.

ఈ లోపు పోలీసులు అక్కడికి చేరుకొని టీడీపీ కార్యకర్తలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. విషయం తెలుసుకున్న టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బ్రహ్మారెడ్డి వెంటనే ఆ ప్రదేశానికి చేరుకున్నారు. కానీ బ్రహ్మారెడ్డిని పోలీసులు వాహనంలో ఎక్కించి గుంటూరుకు తరలించారు. వెనక్కి తగ్గినట్టే తగ్గిన వైసీపీ కార్యకర్తలు గంట తర్వాత మళ్లీ రెచ్చిపోయారు. గుంపులు గుంపులుగా విడిపోయి కర్రలతో హల్చల్ చేశారు. టీడీపీ కార్యకర్తల దుకాణాలు వాహనాలపై దాడికి దిగారు. బ్రహ్మారెడ్డి తన కార్యాలయంగా, నివాసంగా వాడుకుంటున్న భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ ప్రాంతంలో కరెంటు తీయించి ఆయన ఇంటిని ధ్వంసం చేసి ఫర్నిచర్ పై పెట్రోల్ పోసి తగలబెట్టారు. దీంతో ఆగకుండా రెండు స్కార్పియోలను పగలకొట్టి, ఒక స్కార్పియో దహనం చేశారు.

రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ,లోకేష్ లు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. వైసీపీ నిర్వహించిన బీసీ గర్జన విజయమంతం అయ్యిందనే అక్కసుతో చంద్రబాబు కుట్రకు పాల్పడుతున్నాడని టీడీపీ అనునూయులతో విధ్వంసం సృష్టించి వాహనాలు తగలబెట్టించి తమపై నేడుతున్నారని , పల్నాడు ప్రజల మధ్య చిచ్చు పెట్టాలన్న కుట్రతో ఇలాంటి దుశ్చర్యలకు చంద్రబాబు పాల్పడుతున్నారని అన్నారు. ఈ విషయంపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ శ్రేణులపై దాడి చేసి పార్టీ నేతల ఇళ్లకు, పార్టీ కార్యాలయానికి నిప్పు పెట్టిన ఘటనలను తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. దీనిపై గుంటూరు రేంజ్ డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు. వైసీపీ గుండాలకు సహకరించిన పోలీస్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.