‘భారత్‌లో ఎందరో ఏకలవ్యులు’..రాహుల్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశంలో నైపుణ్యాలకు, ప్రతిభకు కొదవ లేదని, కానీ వాటికి విలువ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. అమెరికా పర్యటనలో భాగంగా ఆయన టెక్సాస్ విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాట్లాడారు. మహాభారతంలోని ఏకలవ్యుని కథను ఈసందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎంతో ప్రతిభ, నైపుణ్యం ఉన్న ఏకలవ్యుని బొటనవేలును గురువు ద్రోణాచార్యుడు గురుదక్షిణగా తీసుకున్న సంఘటనను వివరించారు. ఇలాంటి ఏకలవ్యులు ఎందరో భారతదేశంలో ఉన్నారని, వారి ప్రతిభకు తగిన విలువ లేదని, నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి అవకాశం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో ఉపాధి కల్పనకు చైనా వలెనే భారత్ కూడా దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. ఉత్పత్తి రంగంలో ఆధిపత్యం వల్లనే చైనాలో నిరుద్యోగం లేదని పేర్కొన్నారు.
మరోపక్క రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్ గాంధీ విదేశాలలో భారత్ పరువు తీస్తున్నారని, భారత్‌ను అవమానిస్తున్నారని కేంద్రంమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. చైనా కమ్యూనిస్టు పార్టీతో చేసుకున్న ఒప్పందం వల్లే రాహుల్ ఎప్పుడూ చైనాను పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు.