వైసీపీ నేతలపై కేసులుండవ్… మేం ఏం చేయకున్నా కేసులు..!
విశాఖ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నారు. తన వైజాగ్ పర్యటనపై స్పందించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్… మీడియాతో మాట్లాడుతూ వైసీపీ లీడర్లు భయపెట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు . అందుకే అడ్డూ అదుపూ లేకుండా బూతులు తిడుతూ.. ఇంట్లో వాళ్లపై నోరేసుకొని పడిపోతారని విమర్శించారు. ఇలా భయభ్రాంతులకు గురి చేస్తే ఎవరూ నోరు ఎత్తరని వాళ్ల ప్లాన్‌గా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. ఇలాంటి ఉడత ఊపులకు బెదిరింపులకు తాను, జనసేన భయపడేది లేదన్నారు. భారత దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోందన్నారు. ఇక్కడ అధికార పార్టీ వాళ్లు దాడులు చేసినా బూతులు తిట్టినా కేసులు ఉండవని… ప్రజల తరఫున ఎవరు మాట్లాడినా హత్యాయత్నం కేసులు పెడతారన్నారు. ఇది ఇంకా ఎన్నాళ్లో సాగదని పవన్ హెచ్చరించారు.

ఉత్తరాంధ్రలో జనాల సమస్యలు తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామే తప్ప వైసీపీ చేపట్టిన గర్జనకు వ్యతిరేకంగా కాదన్నారు. అసలు గర్జన కార్యక్రమం ప్రకటించక ముందే తాము మూడు రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకున్నామని తెలిపారు పవన్. ప్రజలు భారీ మెజారిటీ ఇచ్చి పాలన చేయమంటే… ప్రజల సమస్యలు తీర్చకుండా గర్జన పేరుతో టైం పాస్ చేస్తున్నారని విమర్శించారు. మొదటి నుంచి తాము చెప్పినట్టు ఎక్కడా వ్యక్తిగత విమర్శలు లేకుండా.. నిర్మాణాత్మమైన విమర్శలు మాత్రమే చేస్తున్నామన్నారు. ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న మూడు రాజధానులపై ప్రజలు స్పందించడం లేదనే వారి బాధని అందుకే కొత్త ఎత్తుగడలతో హింసాత్మక రాజకీయాలు చేస్తున్నారని పవన్ మండిపడ్డారు. మంచి పాలన చేయాల్సిన వాళ్లు గొడవ పెడుతున్నారన్నారు. ఏపీలో ప్రభుత్వమే లా ఆండ్ ఆర్డర్‌ను దెబ్బతీస్తుందని ఆరోపించారు. కోనసీమ ఘటనే అందుకు ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇలాంటి హింసాత్మకమైన గొడవలు తాము చేయలేమని అన్నారు.