ప్రపంచంలోనే తొలి స్మార్ట్ కాలిక్యులేటర్ హైదరాబాద్‌లో..
ప్రపంచంలోనే తొలి స్మార్ట్ కాలిక్యులేటర్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు ఆదాయ, వ్యయాల లెక్కింపులో ఉపయోగపడే ఈ మేడ్ ఇన్ ఇండియా కాలిక్యులేటర్.. టుహ్యాండ్స్ మొబైల్ యాప్ ద్వారా పని చేస్తుంది. వ్యాపారులు ప్రతి లావాదేవీని ఇందులో నమోదు చేయాల్సిన అవసరం లేదు. లావాదేవీల వివరాలన్నీ రియల్ టైమ్‌లోనే నిక్షిప్తం కావడం ఈ పరికరం ప్రత్యేకత. టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీ సీడ్ ఫండ్, టీ-హబ్ వంటి స్టార్టప్‌ల సహకారంతో రూ.50 లక్షల నిధులు సేకరించి తయారు చేసిన ఈ స్మార్ట్ కాలిక్యులేటర్‌ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆవిష్కరించారు.

స్మార్ట్ కాలిక్యులేటర్ ధర రూ.2,999
జపాన్, చైనా తయారు చేస్తున్న సాధారణ కాలిక్యులేటర్ల గుత్తాధిపత్యానికి ఈ స్మార్ట్ కాలిక్యులేటర్‌తో చెక్ పడుతుందని జయేశ్ రంజన్ అన్నారు. చిన్న, మధ్య తరహా వ్యాపారుల బుక్ కీపింగ్‌లో పారదర్శకతను ఈ స్మార్ట్ కాలిక్యులేటర్ తీసుకొస్తుందని టుహ్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవిష్కర్త ప్రవీణ్ మిశ్రా చెప్పారు. ఆల్ఫా న్యూమరిక్ కీ బోర్డుతో కూడిన ఈ స్మార్ట్ కాలిక్యులేటర్ పవర్ రీచార్జ్ చేసిన తర్వాత 3 రోజుల పాటు నడుస్తుందని తెలిపారు. దీని ధరను రూ.2,999గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఏడాది వారంటీతో పని చేసే ఈ పరికరంలో 90 రోజుల డేటాను సులభంగా పొందవచ్చని వివరించారు.