మహిళను చంపి.. ముక్కలు చేసి.. డ్రమ్ములో కుక్కి..
ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్యకేసును మరిచిపోక ముందే విశాఖ పట్నంలో అలాంటి దారుణమే జరిగింది. మధురవాడ వికలాంగుల కాలనీలో ఓ మహిళను హత్య చేసిన దుండగుడు ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి ప్యాకింగ్ కూడా చేయడం సంచలనం సృష్టించింది. అంతేకాదు.. మృతదేహాన్ని ప్లాస్టిక్ సంచుల్లో ప్యాక్ చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో భద్రపరిచాడు. తర్వాత ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు. అప్పటి వరకూ అద్దెకు ఉన్న వాళ్లు వదిలి పెట్టిన సామాగ్రిని తొలగించిన ఇంటి యజమానికి ఈ మృతదేహం కనిపించడంతో ఉలిక్కి పడ్డాడు. వాసన రాకుండా ప్లాస్టిక్ డ్రమ్ములో ప్యాక్ చేసిన మృతదేహం పూర్తిగా కుళ్లిపోయిన తర్వాత పూడ్చి పెట్టాలని నిందితులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రుషి (40)ని అరెస్టు చేసిన పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతంపేటకు చెందిన నిందితుడికి ఎవరెవరు సహకరించారో ఆరా తీస్తున్నారు. హతురాలి వివరాలను పోలీసులు రహస్యంగా ఉంచారు. రుషికి, హతురాలికి మధ్య ఆర్థిక విభేదాలు తలెత్తినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో విచారణ చేపట్టారు. ఇంటి యజమాని రమేశ్ వెల్డింగ్ షాపులోనే నిందితుడు కొంత కాలం పాటు సహాయకుడిగా పని చేసినట్లు తెలుస్తోంది. మహిళ మృతదేహం పూర్తిగా కుళ్లపోయి.. ఆనవాళ్లు లేకపోవడంతో ఆమె గురించిన సమాచారాన్ని పోలీసులు రాబట్టలేక పోతున్నారు. మృతదేహం ఇంతగా కుళ్లినా వాసన రాకుండా నిందితుడు ఏ రసాయనాలు వాడాడో పోలీసులు ఆరా తీస్తున్నారు.