NewsTelangana

సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలి

బీజేపీ, టీఆర్ఎస్‌ కుమ్మక్కయ్యాయని.. రెండు పార్టీలూ వ్యూహాత్మకంగా వివాదం సృష్టిస్తున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇలాంటి ప్రయత్నమే చేశారని.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా కూడా కాంగ్రెస్‌ ఆనవాలు లేకుండా చేయాలనే కుట్ర చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దుబ్బాకలో కేసీఆర్‌పై కోపంతో బీజేపీకి వేశారని.. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌కు వేయాల్సిన వాళ్లు కూడా ఈటలపై సానుభూతితో బీజేపీకి వేశారని గుర్తు చేశారు. తెలంగాణాలో కాంగ్రెస్‌ ప్రభావాన్ని తగ్గించేందుకు బీజేపీ, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి వ్యూహంతో ముందుకెళ్తున్నాయని విమర్శించారు.

రోహిత్‌ రెడ్డిని నిందితుడిగా చేర్చాలి..

మునుగోడు ఉప ఎన్నిక, రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో పాదయాత్రపై ప్రజల దృష్టి పడకుండా చేసేందుకే కేసీఆర్‌ ఫాంహౌస్‌ ఉదంతాన్ని వెలుగులోకి తీసుకొచ్చారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ వివాదంలో నలుగురు ఎమ్మెల్యేల ఫోన్లను ఎందుకు సీజ్‌ చేయలేదని.. రోహిత్‌ రెడ్డిని నిందితుడిగా చేర్చకుండా పీసీ యాక్ట్‌ నిలబడదనే విషయం పోలీసు కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్రకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఈ కేసులో సీసీ కెమెరాలే కీలకమని.. సుప్రీం కోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయిస్తేనే వాస్తవాలు బయటికొస్తాయని చెప్పారు. 2014 నుంచి ఇప్పటి వరకు 32 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంపై సీఎం కేసీఆర్‌ వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.