Home Page SliderTelangana

వేములవాడలో ఆది నుంచి అదే సెంటిమెంట్!?

ప్రతిష్టాత్మక శైవక్షేత్రం వేములవాడలో ఈసారి గెలుపు నీదా, నాదా అన్న పరిస్థితి నెలకొంది. అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ మూడు పార్టీలు గెలుపు కోసం హోరాహోరీ తలపడుతున్నాయ్. ఇక్కడనుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా చెల్మెడ లక్ష్మీనరసింహారావు బరిలో దిగగా, కాంగ్రెస్ నుంచి ఆది శ్రీనివాస్, బీజేపీ నుంచి మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్ రావు పోటీలో దిగారు. వాస్తవానికి బీజేపీ హైకమాండ్ ఇక్కడ్నుంచి తుల ఉమకు తొలుత టికెట్ కేటాయించగా ఆ తర్వాత అక్కడ్నుంచి వికాస్ కు పార్టీ స్థానిక నాయకత్వం అవకాశం ఇచ్చింది. దీంతో తుల ఉమ బీఆర్ఎస్ పార్టీలో చేరి, ఆ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వేములవాడలో మరోసారి విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి చెన్నమనేని రమేష్ నాలుగుసార్లు విజయం సాధించినప్పటికీ ఆయనపై పౌరసత్వ వివాదం రాజుకుంటూనే ఉంది. దీంతో ఈసారి అక్కడ్నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని మార్చి ప్రయోగం చేస్తోంది. అయితే ఈ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఓటమిపాలై.. తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తున్న ఆది శ్రీనివాస్ ఈసారి వేములవాడపై గురిత్పపదంటున్నారు. ఆది కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి, అక్కడ్నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి బీజేపీలోకి మళ్లీ కాంగ్రెస్‌లోకి ఇలా పార్టీలు మారుతున్నా అదృష్టం వరించడం లేదు. వేములవాడ రాజన్న ఆలయ చైర్మన్ ఎన్నికల్లో గెలవరన్న సెంటిమెంట్‌ను ఈసారి ఆది శ్రీనివాస్ ఎలా బ్రేక్ చేస్తారో చూడాలి. వచ్చే ఎన్నికల్లో గెలిపు తనదేనన్న దీమాతో ఉన్నారు. అయితే ఇక్కడ గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన సీహెచ్ విద్యాసాగర్ రావు తనయుడి వికాస్‌ని తొలిసారే విజేతగా నిలపాలని గట్టి ప్రయత్నం చేస్తున్నారు.

వేములవాడ నియోజకవర్గంలో 260 పోలింగ్ బూత్‌లు ఉండగా పురుష ఓటర్లు 1,04,943 కాగా, మహిళా ఓటర్లు 1,13,186 మంది ఉన్నారు. ట్రాన్స్ జెండర్లు 31 మంది ఉన్నారు. మొత్తం ఓటర్లు 2,18,160 మంది ఉన్నారు. ఈ సెగ్మెంట్‌లో బీసీ ఓటర్లు 16 శాతం వరకు వ్యాపించి ఉన్నారు. ఇక మున్నూరుకాపులు 13 నుంచి 14 శాతం, మాదిగలు పదకుండున్నర శాతం, గొల్ల-కురుమలు 8 శాతం, పద్మశాలీలు, మాల సామాజికవర్గ ఓటర్లు 8 శాతానికి చేరువలో ఉన్నారు. తెనుగు-ముదిరాజ్ ఓటర్లు 7 శాతం ఉండగా, గౌడలు 6 శాతం, రెడ్డి సామాజికవర్గం ఓటర్లు 4 నుంచి 5 శాతం మేర ఉన్నారు. వైశ్యులు సైతం ఈ నియోజకవర్గంలో 4 శాతం మేర ఓటర్లుగా ఉన్నారు. ఇతర కులస్తులు సుమారు 14 నుంచి 15 శాతం మధ్య ఉన్నారు.