రోజూ అవే ప్రశ్నలు వేస్తున్నారు… కోర్టుకు ఫిర్యాదు చేసిన సిసోడియా
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా రిమాండ్‌ను కోర్టు మరో రెండు రోజుల పొడిగించింది. రద్దు చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా… అభ్యర్థనను శుక్రవారం పరిశీలిస్తామని కోర్టు చెప్పింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతను సోమవారం కోర్టు ముందు హాజరుపరచాలని ప్రత్యేక న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్ సీబీఐని ఆదేశించారు. గతంలో మంజూరు చేసిన మూడు రోజుల రిమాండ్ ముగిశాక సిసోడియాను కోర్టు ముందు హాజరుపరిచిన తర్వాత సీబీఐ మరో మూడు రోజుల కస్టడీ కోరింది. ఈ సందర్భంగా… తాను కస్టడీలో ఉన్నప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు సిసోడియా. ఇప్పటికే కేసుకు సంబంధించి రికవరీలు పూర్తయ్యాయని ఆయన కోర్టుకు చెప్పారు. దర్యాప్తును పూర్తి చేయడంలో సీబీఐ అసమర్థత స్పష్టమంటూ కోర్టుకు వివరించారు సిసోడియా తరపు లాయర్. కస్టడీలో తన పట్ల సీబీఐ బాగానే వ్యవహరిస్తున్నప్పటికీ, పదే పదే వేస్తున్న ప్రశ్నలతో… మానసికంగా వేధనకు గురవుతున్నానన్నారు. ఐతే అవే ప్రశ్నలు అడగొద్దని సీబీఐని కోర్టు ఆదేశించింది.
