NewsTelangana

మునుగోడు ఎన్నికల ప్రచారంతో పాలన బంద్

మునుగోడు ఫీవర్ ఇప్పుడు తెలంగాణ మొత్తం అంటుకుంది. మునుగోడులో జరగుతున్న ఉపఎన్నికపై సీఎం కేసీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో ఇప్పుడు నాయకులంతా చలో మునుగోడు అంటున్నారు. మునుగోడులో ఉన్న 77 ఎంపీటీసీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులను పార్టీ మోహరించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీనియర్ నేతలు మునుగోడు చేరుకున్నారు. వారంతా మునుగోడుకు రావడంతో వ్యవస్థల్లో పనులన్నీ ఆగిపోయాయ్. ఎక్కడికక్కడ కార్యక్రమాలు నిర్వహించలేని దుస్థితి నెలకొంది. నాయకులంతా మునుగోడులో పార్టీని గెలిపించే బాధ్యతలు చేపట్టడంతో ప్రభుత్వ ప్రధాన ఆఫీసులన్నీ నామ్ కే వాస్త్ అన్నట్టుగా నడుస్తున్నాయ్. అటు సీఎం కేసీఆర్ సైతం భారత్ రాష్ట్ర సమితి పనుల్లో ఢిల్లీలో బిజీగా ఉండటంతో పాలన అంతంతగానే సాగుతోంది. కేసీఆర్ హైదరాబాద్ తిరిగొచ్చినా.. మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం పోలింగ్ జరిగే ముందు తప్పించి వారి వారి పనుల్లో భాగమవడం దాదాపు అసాధ్యం. దీంతో ప్రధాన కార్యాలయాల్లో పనులన్నీ స్తంభించిపోతున్నాయన్న చర్చ మొదలైంది. మునుగోడు ఉపఎన్నిక టాస్క్‌తో నేతలంతా తమ పెండింగ్ పనులన్నింటినీ ఆపేసి.. ఎన్నికల్లో ఓట్లు ఎలా రాబట్టాలన్నదానిపై చర్చిస్తున్నారు.