Home Page SliderNationalPoliticsTelangana

వాడివేడిగా కొనసాగిన పార్లమెంట్‌… రేవంత్‌, నిర్మల మధ్య వార్‌…

ఈ రోజు పార్లమెంట్‌ సమావేశాలు వాడి వేడిగా జరిగాయి. క్వశ్చన్‌ అవర్‌లో ఎంపీ రేవంత్‌ రెడ్డి, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. క్వశ్చన్‌ అవర్‌ సందర్భంగా రేవంత్‌ రెడ్డి రూపాయి విలువ పతనం గురించి కేంద్ర ప్రభుత్వాన్ని హిందీలో ప్రశ్నించారు. రోజురోజుకు రూపాయి విలువ పడిపోతుందని గతంలో మోదీ చెప్పిన విషయాన్ని రేవంత్‌ గుర్తు చేశారు. ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని రూపాయి విలువ గురించి ప్రశ్నించారని, ఇప్పుడు అదే ప్రశ్న నేను అడుగుతున్నానన్నారు. దీనిపై స్పీకర్‌ జోక్యం చేసుకున్నారు. నేరుగా ప్రశ్న అడగాలని సూచించారు. దీంతో సర్‌, మధ్యలో అంతరాయం కలిగించొద్దు అంటూ రేవంత్‌ అన్నారు. ఈ విషయంపై స్పీకర్‌ సీరియస్‌ అయ్యారు. అలా అనడం సమంజసం కాదని, మరోసారి ఇలా చెప్పకూడదని రేవంత్‌ను హెచ్చరించారు స్పీకర్‌.

రూపాయి పతనంపై రేవంత్‌ ప్రశ్నకు నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తూ.. కాంగ్రెస్‌ ఎంపీ వీక్‌ హిందీలో అడిగిన ప్రశ్నకు వీక్‌ హిందీలోనే సమాధానం ఇస్తానన్నారు.  అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పటి ఆర్థిక వ్యవస్థ ఇప్పటి ఆర్థిక వ్యవస్థ వేరు. కేవలం రూపాయి మారకపు విలువనే కాదు. ఇతర సూచీలను ప్రస్తావిస్తే బాగుంటుందని అన్నారు. అప్పటి ఆర్థిక వ్యవస్థ ఐసీయూలోనే ఉందనీ కానీ ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని చెప్పారు. కరోనా మహమ్మరి, రష్యా – ఉక్రెయిన్‌ యుద్ధం వంటి పరిణామాలు చోటు చేసుకున్నా భారత్‌ రాణిస్తోందన్నారు. ఇందుకు గర్వించాల్సింది పోయి అసూయ చెందుతున్నారని నిర్మలా తప్పుబట్టారు. అయితే.. నిర్మలా సీతారామన్‌ తన హిందీ గురించి చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను తక్కువ కులం వాడినంటూ పేర్కొనడంతో సభ్యులెవరూ అలా మాట్లాడుకోవద్దని, ప్రజలచేత ఎన్నుకోబడిన లోక్‌ సభ మెంబర్లంటూ స్పీకర్‌ వారించారు.