NationalNews

కాంగ్రెస్ కొత్త చీఫ్… గాంధీల అభిప్రాయాలను వినాల్సిందే-చిదంబరం

కొత్త కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నిక.. పార్టీలో గాంధీ కుటుంబ పాత్రను ఎంత మాత్రం తగ్గించలేవన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం. 25 ఏళ్లలో తొలిసారిగా గాంధీయేతర అధినేతకు పార్టీ నేతలు ఓటు వేశారు. కొత్త కాంగ్రెస్ చీఫ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా గాంధీలు రిమోట్ కంట్రోల్‌ను కలిగి ఉంటారనే ప్రచారం అవాస్తవమన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల తర్వాత చిదంబంరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత అనవసరమైన విమర్శలతో గాంధీ కుటుంబం బాధపడిందన్నారు. అందుకే ఎన్నికలలో పాల్గొనడానికి నిరాకరించారని.. గాంధీయేతర వ్యక్తి బాధ్యతలు చేపట్టే సమయం ఆసన్నమైందని తేల్చి చెప్పారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ వాద్రాతో సహా దాదాపు 9,000 మంది ప్రతినిధులు మల్లికార్జున్ ఖర్గే, శశి థరూర్‌లలో ఎవరినో ఒకర్ని ఎన్నుకోడానికి ఓటు వేశారు.

గాంధీ కుటుంబ సభ్యులు ఎన్నికలో పోటీ చేయనప్పటికీ… ఖర్గే వారి ప్రతినిధి అన్న భావన నెలకొంది. కొత్త అధ్యక్షుడు గాంధీల “రిమోట్ కంట్రోల్” అన్న చెడు భావన తొలగించాలన్నారు చిదంబరం. ఎన్నికల్లో గెలిచిన వారు రోజు వారీ కార్యక్రమాల్లో 90 నుంచి 95 శాతం వారే చేస్తారన్నారు. ఐతే కీలక నిర్ణయాల విషయంలో నాయకులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC), పార్లమెంటరీ బోర్డు, ఇందులో గాంధీలు తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. గాంధీ కుటుంబ సభ్యులు లేకుండా కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం దేశంలో పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ కలిగేలా చేస్తుందన్నారు.