ప్రభుత్వం తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలి
మెదక్ జిల్లా వరద ముప్పు ప్రాంతాల్లో గురువారం మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాజిపేట గ్రామంలో వరదలో గల్లంతైన ప్రాంతాలను పరిశీలించి, వరదలో ప్రాణాలు కోల్పోయిన సత్యం కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మెదక్, కామారెడ్డి జిల్లాలు వరదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నా ముఖ్యమంత్రి మాత్రం మూసి సుందరీకరణ, ఆటల పోటీలపై సమీక్షలు చేస్తున్నారు. ఒక మంత్రి అయితే అత్యవసరం అయితే తప్ప హెలికాప్టర్ వాడలేమని అంటున్నారు. రాజిపేటలో ఇద్దరు వరదల్లో చిక్కుకుని కరెంట్ పోల్ ఎక్కి నాలుగైదు గంటలు సహాయం కోసం ఎదురుచూశారు. ఇది కేవలం ప్రభత్వ అసమర్ధత , నిర్లక్ష్యం అని విమర్శించారు. అలాగే, వరదలో మృతులైన రెండు కుటుంబాలకు కనీసం రూ.25 లక్షల ఆర్థిక సహాయం అందించాలనీ, వరదల కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25,000 చొప్పున పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని హరీష్ రావు అన్నారు.ప్రస్తుతం మెదక్ ముంపు ప్రాంత ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారని, తాగునీరు లేక వర్షపు నీరు తాగాల్సిన పరిస్థితి నెలకొన్నదని, ధూప్ సింగ్ తాండా ప్రజలు కూడా సహాయం కోసం ఎదురు చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

