బ్రిటన్లో తిండికి లేక తల్లడిల్లుతున్న సామాన్యులు
మనసర్కార్
బ్రిటన్లోని ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. రోజురోజుకీ ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాలుస్తోంది. బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ నిర్ణయాలు మరింత పతనానికి దారితీస్తున్నాయని సొంత పార్టీ సభ్యులే విమర్శిస్తున్నారు. హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మన్ రాజీనామా లేఖలో ఆమె ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దాదాపు మూడువేల మందిని సర్వే చేసిన విచ్ అనే వినియోగదారుల సంస్థ కొన్ని దారుణ విషయాలను వెల్లడించింది. లక్షలాది మంది ప్రజలు జీవన వ్యయాన్ని భరించలేక భోజనాన్ని మానేస్తున్నారట. చాలావరకూ ఇళ్లలో విద్యుత్ వినియోగం తగ్గిపోయిందట. ఒక పూట మాత్రమే భోజనం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం వంటి చర్యల ద్వారా ఖర్చులు తగ్గించుకుంటున్నారు బ్రిటన్ ప్రజలు.

విపరీతంగా పెరిగిన ఇంధన ధరలు బ్రిటన్ ఆర్థిక స్థితిని చాలా ప్రభావితం చేశాయి. ప్రతీ 5 కుటుంబాలలో ఒక కుటుంబానికి ఆహారం కొరత సమస్య ఏర్పడుతోంది. కొవిడ్-19 , ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో వస్తు సరఫరా వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఈ సంవత్సరం ఆరంభం నుండే ఆహార సంక్షోభం ఎక్కువవుతోంది. 20 శాతం కుటుంబాలు తమ ఆహార వినియోగం తగ్గించుకోవల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రధాని లిజ్ ఇటీవల మినీబడ్జెట్ ప్రకటించారు. దీనిలో సామాన్యప్రజలతో సమానంగా ధనిక వర్గాలకు కూడా ఇంధన రాయితీ ఇవ్వడం చాలా విమర్శలకు దారితీసింది. అటుపై ఆమె క్షమాపణలు కూడా తెలిపింది. ఆమెపై అవిశ్వాస తీర్మానానికి కూడా పార్టీ సభ్యులు నిర్ణయించినట్లు సమాచారం.

