రీల్స్ చూస్తున్న డాక్టర్.. బాధతో విలవిలలాడుతూ మహిళ మృతి
ఉత్తరప్రదేశ్ – మైన్‌పూరి జిల్లాకు చెందిన ప్రవేశ్ కుమారి (60) అనే మహిళ నిన్న గుండెపోటుకు గురవడంతో, కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని మహారాజా తేజ్‌సింగ్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్ ఆదర్శ్ సెంగార్ బాధితురాలి వద్దకు నర్సులను పంపి.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చూస్తూ కూర్చున్నాడు. కుటుంబ సభ్యులు వైద్యం చేయాలని అడిగినా పట్టించుకోలేదు. ఐదు నిమిషాల పాటు బాధతో విలవిలలాడిన ప్రవేశ్ కుమారి సరైన వైద్య సహాయం అందక పోవడంతో ప్రాణాలు కోల్పోయింది. ఆగ్రహించిన మృతురాలి కుటుంబ సభ్యులు వైద్యం ఎందుకు చేయలేదని ప్రశ్నించగా, వారిపై డాక్టర్ ఆదర్శ్ దాడి చేశాడు. దీంతో డాక్టర్‌పై కుటుంబ సభ్యులు దాడి చేశారు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాక్టర్‌పై కేసు నమోదు చేశారు. చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో సీసీటీవీని పరిశీలిస్తున్నామని.. ఆరోపణలు నిజమని తేలితే డాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.