కాసేపట్లో నోయిడా ట్వి టవర్స్ కూల్చివేత
ప్రపంచంలోనే అరుదైన ఘటన
అక్రమకట్టడాల కూల్చివేతలో దేశంలోనే చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం ఇవాళ నోయిడాలో జరగబోతోంది. ఈరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు అక్రమంగా నిర్మించిన నోయిడా సూపర్‌టెక్ ట్విన్ టవర్లను కూల్చివేస్తారు. సెక్టార్ 93Aలోని రెండు భారీ టవర్లు నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని విచారణలో నిర్ధారణయ్యింది. ఒక్కో టవర్లో 40 అంతస్తులు నిర్మించాలని ప్లాన్ చేశారు. కోర్టు అనుమతులు నిలిపేయడంతో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. ప్రస్తుతం ఏపెక్స్ టవర్ 32 అంతస్తులు కాగా… సియాన్ టవర్ 29 అంతస్తులు మేర నిర్మించారు. మొత్తం 900 అపార్ట్మెంట్లు నిర్మించాలని ప్లాన్ చేశారు. వాటిలో మూడొంతలు ఇప్పటికే అమ్మడం గానీ… బుక్ కావడం గానీ జరిగింది.

వడ్డీతో సహా చెల్లించాలన్న సుప్రీం కోర్టు
ట్విట్ టవర్లలో ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులకు నష్టం వాటిల్లకుండా కోర్టు తీర్పు చెప్పింది. ఎవరైతే ఫ్లాట్లు కొనుగోలు చేశారో వారందరికీ వడ్డీతో సహా మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఏపెక్స్ టవర్ 103 మీటర్లు ఎత్తుకాగా… సియాన్ టవర్ 97 మీటర్లు. దక్షిణాఫ్రికా జొహన్స్ బర్గ్ లో 108 మీటర్ల ఎత్తున ఇలాంటి నిర్మాణాన్ని గతంలో కూల్చిన ఎడిఫైస్ ఇంజినీరింగ్ కంపెనీ ఇప్పుడు ఈ నిర్మాణాన్ని కూల్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇండియాలో ఇప్పటి వరకు 68 మీటర్లు ఎత్తున నిర్మాణాన్ని కేరళలో 2020లో కూల్చేవేశారు. అనుమతులు సరిగా లేవన్న కారణంగా 168 మీటర్లున్న భవనాన్ని దుబాయ్‌లోనూ కూల్చేశారు. ఐతే తాజాగా నోయిడాలో కూల్చుతున్న భవనాలకు సమీపంలో… 8 మీటర్ల దూరంలో మరికొన్ని నిర్మాణాలుండగా… 9- నుంచి 12 మీటర్ల పరిధిలో చాలా ఉన్నాయ్.

రంగంలోకి కూల్చివేతలో అనుభవం ఉన్న కంపెనీ
దక్షిణాఫ్రికాలో 7.8 మీటర్ల పరిధిలో ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బంది కలక్కుండా నాడు ఎడిఫైస్ కంపెనీ కూల్చింది. ఐతే సమీప భవానాల్లో ఎలాంటి డస్ట్ పడకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇందుకోసం ప్రత్యేక క్లాత్ ను అన్ని భవనాలకు అమర్చారు. 7 వేల రంధ్రాల్లో 3700 కేజీల పేలుడు పదార్థాలను అమర్చారు. కేవలం 9 సెకండ్లలోనే నిర్మాణం కుప్పకూలే అవకాశం ఉంది. గ్రేటర్ నోయిడా ఎక్స్ ప్రెస్ హైవేపై మధ్యాహ్నం 2.15 నుంచి 2.45 నిమిషాల పాటు సుమారుగా అరగంట సేపు ట్రాఫిక్ నిలిపివేస్తారు. మొత్తం 12 నిమిషాల్లో అక్కడ ఏర్పడిన డస్ట్ ను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 వేల ట్రక్కుల్లో మొత్తం 55 వేల టన్నుల వ్యార్థాలు కూల్చివేత కారణంగా పోగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

కూల్చివేతతో సెకనుపాటు భూకంపం వచ్చినట్టే
30 మీటర్ల సమీపంలో 30 మిల్లీ సెకండ్లు అంటే సుమారుగా ఒక సెకనుపాటు భూమి కంపించే అవకాశం ఉంది. రిక్టరు స్కేలుపై 0.4 శాతం భూకంప సూచికన్నమాట. సమీపంలోని 7 వేల మంది ప్రజలు ఉదయం 7 గంటల నుంచి సమీప ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా అధికారులు సూచించారు. సాయంత్రం 4 గంటల తర్వాత విద్యుత్, గ్యాస్ పవర్ పునరుద్ధరిస్తారు. ఐదున్నర తర్వాత వారి వారి అపార్ట్‌మెంట్లలోకి వెళ్లేందుకు అవకాశం కల్పిస్తారు. 9 ఏళ్ల తర్వాత కోర్టు తుది తీర్పును ఆగస్టులో వెలువరించింది. వంద కోట్ల రూపాయలకు మొత్తం కూల్చివేతను ఇన్సూరెన్స్ చేయడం విశేషం. ఘటన సమయంలో సమీపంలోని భవనాలకు ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఈ మొత్తాన్ని ఉపయోగించాలని నిర్ణయించారు. అంతకంటే ఏదైనా ఖర్చు జరిగితే ఆ మొత్తాన్ని సూపర్ టెక్ భరించాల్సి ఉంటుంది. కూల్చివేతకు 20 కోట్లు రూపాయలు వ్యయం కాగా… రెండు టవర్ల వల్ల నష్టం సుమారుగా రూ. 50 కోట్లుగా అంచనా వేశారు.