కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకు రంగం సిద్ధం
◆ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
◆ వారసుడ్ని ఎన్నుకోవడం కోసం ముమ్మర కసరత్తు
◆ సోనియాను కలిసిన అశోక్ గెహ్లాట్
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం పార్టీ కేంద్ర ఎన్నికల మండలి నోటిఫికేషన్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా సుదీర్ఘకాలం పనిచేసిన సోనియాగాంధీ తన వారసుడిని ఎన్నుకోవడం కోసం ముమ్మర కసురత్తులు చేస్తున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిశారు. కొచ్చిలో ఉన్న రాహుల్ గాంధీని కలిసి ఒప్పించి పార్టీ పగ్గాలు చేపట్టేలా గెహ్లాట్ చివరి ప్రయత్నం చేయాలని భావిస్తున్నారు. పార్టీ ప్రజలు కోరుకుంటే తాను నామినేషన్ దాఖలు చేస్తానని తనకిచ్చిన ఏ బాధ్యతనైన నెరవేరుస్తానని అశోక్ గెహ్లాట్ అన్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీని ఒప్పించేందుకు చివరి ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు బలం చేకూర్చే నిర్ణయాలు తీసుకుంటానని పార్టీ అధిష్టానం తనకు అన్నీ పదవులు ఇచ్చిందని 50 సంవత్సరాలుగా వివిధ పదవుల్లో ఉన్నానని తనకు పదవి ముఖ్యం కాదని ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని మీడియా ముఖంగా తెలిపారు.

కాంగ్రెస్‌లో మళ్లీ అంతో ఇంతో ప్రజాస్వామ్య ఛాయలు అంకురిస్తున్న అనుమానాలు వస్తున్నాయి. 137 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా సోనియా సోనియాగాంధీ సుదీర్ఘకాలం పాటు అధ్యక్షురాలుగా కొనసాగారు. 2017 నుండి 2019 వరకు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న రాహుల్ గాంధీ 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం అయిన నేపథ్యంలో రాజీనామా చేయటంతో అప్పటినుండి మళ్లీ తాత్కాలిక అధ్యక్షురాలుగా సోనియా కొనసాగుతున్నారు. గతంలో ఒక్కసారి మాత్రం రాజేష్ పైలెట్ అధ్యక్ష ఎన్నిక కోసం నామినేషన్ వేసిన చివరకు పోటీ నుంచి విరమించుకున్నారు. నిజానికి ఇందిరా గాంధీ కుటుంబం నుండి ఎవరో ఒకరు ఆ పార్టీ అధ్యక్షులుగా ఉంటేనే బాగుంటుంది అన్న అభిప్రాయం ఆ పార్టీ నాయకుల్లో బలంగా నాటుకుంది.

ఈ నేపథ్యంలో అక్టోబర్ 17వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షస్థానానికి జరగనున్న ఎన్నికలలో ఏమి జరుగుతుందో చూడాల్సి ఉంది. సోనియా గాంధీ అయితే ఆ స్థానంలో కొనసాగే అవకాశం కనిపించట్లేదు. ఆమె అనారోగ్యం అందుకు కారణం. ఇప్పటికే రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల వద్దా అన్న సందిగ్ధం నుంచి ఇంకా బయటపడలేదు. మొత్తం మీద దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. గురువారం నుంచి ఈనెల ఆఖరి దాక నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 17న ఎన్నిక జరగనుంది ఆ తర్వాత అధ్యక్షులు ఎవరో ప్రకటిస్తారు.

