ఈడీ పదవీకాలంపై కేంద్రానికి సుప్రీంకోర్టులో చుక్కెదురు
కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. ఈడీ డైరక్టర్ సంజయ్ మిశ్రా పదవీకాలాన్ని పొడిగించే విషయంలో కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టింది సుప్రీంకోర్టు. జూలై 31 నాటికి సంజయ్ మిశ్రా పదవీ కాలానికి ముగింపు పలకాల్సిందేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఇప్పటికే మూడుసార్లు ఆయన పదవీ కాలాన్ని పొడిగించడం చట్టవిరుద్ధమని పేర్కొంది సుప్రీంకోర్టు. 1984 బ్యాచ్‌కు చెందిన ఈ ఐఆర్‌ఎస్ ఆఫీసర్ పదవీ కాలాన్ని మరోసారి కూడా పొడిగిస్తే 2023 నవంబరు వరకూ ఆయన పదవిలో కొనసాగుతారు. జస్టిస్ బి.ఆర్. గవై, విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం మిశ్రా పదవీకాలాన్ని ఈ జూలై 31తో ముగించాలంటూ తీర్పు చెప్పింది.

ఆయన పదవిలో ఉండడం వల్ల మనీలాండరింగ్ చట్టం సక్రమంగా అమలు జరుగుతోందన్న కేంద్రం వాదనను సుప్రీం త్రోసిపుచ్చింది. ‘ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్‌లో మిశ్రాతో సమానమైన ఆఫీసర్ లేరా?’ అని ప్రశ్నించింది. 2018లో మొదటి సారి రెండేళ్ల కాలవ్యవధిపై నియమితులైన మిశ్రా పదవీకాలం 2020తోనే ముగిసింది. తిరిగి కేంద్రప్రభుత్వ నిర్ణయంతో మరో మూడేళ్లు పొడిగించగా 2023 వరకూ పదవిలో కొనసాగారు. సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ యాక్ట్ ప్రకారం ఈడీ, సీబీఐ డైరక్టర్ల వంటి కీలక వ్యక్తుల పదవీకాలాన్ని పొడిగించకూడదు. ఎక్కువ కాలం అధికారంలో ఉంటే వారు పదవిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేతలు రణదీప్ సింగ్ సుర్జేవాలా, జయ ఠాకూర్, తృణమూల్ కాంగ్రెస్ నేతలు మాహు మొత్రా, సాకేత్ గోఖలేలు వేసిన పిటిషన్‌పై ఈ కేసును విచారించింది సుప్రీంకోర్టు.