ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఉగ్ర ముప్పు
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందని పాక్ ఇంటెలిజెన్స్ వర్గాలు బాంబ్ పేల్చాయి. విదేశీయులే టార్గెట్ గా పలు ఉగ్ర సంస్థలు దాడులకు పాల్పడేందుకు ప్లాన్ వేస్తున్నట్టు పాక్ ప్రభుత్వానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది. మ్యాచ్ లను తిలకించడానికి వివిధ దేశాల నుంచి భారీగా విదేశీయులు ఇప్పటికే పాక్ కు చేరుకున్నారు. అయితే విదేశీయులను కిడ్నాప్ చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ ప్రావిన్స్ ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వానికి రహస్య సమాచారం అందినట్టు తెలుస్తోంది. ఎయిర్ పోర్టులు, ఓడరేవులు, ఆఫీసులు, ఖరీదైన నివాస ప్రాంతాలపై ఉగ్ర సంస్థ నిఘా వేసిందని ఇంటలిజెన్స్ వెల్లడించింది. ప్రత్యేకంగా పాక్ కు సహాయం చేస్తున్న చైనా, అరబ్ దేశాల నుంచి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుందని తెలిపారు. దీంతో ఆ పాక్ ప్రభుత్వం ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.