Andhra PradeshHome Page Slider

నిరాశ, నిస్పృహల్లో పార్టీ శ్రేణులు, యాక్షన్‌లోకి లోకేష్

స్కిల్ స్కామ్ కేసులో జైలుకు చంద్రబాబు
రాజమండ్రి సెంట్రల్ జైలు స్నేహ బ్లాక్ లో చంద్రబాబు
బాబుకు ఖైదీ నెంబర్ 7691 కేటాయింపు
పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే బాధ్యత తీసుకోనున్న నారా లోకేష్

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తొలిసారిగా బలమైన సాక్షాలు లభించడంతో స్కిల్ స్కామ్ కేసులో ఆదివారం ఏసీబీ కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది. అనంతరం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించి ఖైదీ నెంబర్ 7691 కేటాయించి జైల్లోని స్నేహ బ్లాక్ లో చంద్రబాబును ఉంచారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నిరాశ నిస్పృహల్లో మునిగిపోయాయి. తనపై వచ్చినవన్నీ ఆరోపణలేనంటూ ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన చంద్రబాబు ఇకపై ప్రత్యర్థులపై అవినీతి ఆరోపణలు చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. తనపై వచ్చిన కేసులకు సంబంధించి ఇప్పటివరకు కోర్టులో స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రత్యర్ధులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రతి ఎన్నికలలోను అవినీతి ప్రధానంశంగా ఎత్తిచూపుతూ వస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత ఇప్పుడు అదే అవినీతి అంశంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లడంతో ఆ పార్టీ శ్రేణులు డీలా పడిపోయాయి. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు తొలిసారి జైలుకు వెళ్లడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూసిన తెలుగు తమ్ముళ్లకు న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ఆవేదన కలిగించింది.

నిరాశ నిస్పృహల్లో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులను ముందుకు నడిపించే బాధ్యత ఇప్పుడు యువ నేత నారా లోకేష్ పై పడింది. ఒకవైపు తండ్రి చంద్రబాబు బెయిల్ కోసం న్యాయ నిపుణలతో చర్చిస్తూ కోర్టులోనే గడిపిన లోకేష్ మరోవైపు పార్టీ శ్రేణులను నేతలను ముందుకు నడిపే బాధ్యతను నిర్వర్తించారు. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ లో వెళ్ళటంతో ఆయన బెయిల్ పై తిరిగి వచ్చేవరకు పార్టీ బాధ్యతలు అన్ని నిర్వర్తించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే యువగళం పాదయాత్రతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న లోకేష్ ఎంతో కీలక నేతగా ఎదిగారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకొని వారి నుంచి ప్రశంసలు అందుకుంటున్న లోకేష్ ఇలాంటి సంక్షిప్త సమయంలో ఒకవైపు నేతలు మరోవైపు పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాల్సిన పరిస్థితి నెలకొంది. క్యాడర్లో, నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపి క్షేత్రస్థాయిలో కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

టీడీపీ అనుకున్నట్టుగా జరిగితే చంద్రబాబుకు బెయిల్ లభిస్తే యువనేత లోకేష్ తన పాదయాత్రను యధావిధిగా కొనసాగిస్తారు. చంద్రబాబు రిమాండ్ నేపథ్యంలో లోకేష్ సీనియర్లతో భేటీకానున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే లోకేష్ పార్టీ కీలక నేతలు పోలిట్ బ్యూరో సభ్యులతో సమావేశం కానున్నారు. చంద్రబాబు బెయిల్‌పై తిరిగి వచ్చేవరకు పార్టీ కార్యక్రమాల నిర్వహణ యధావిధిగా సాగేలా పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.