Home Page SliderTelangana

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో రచ్చ రచ్చ

ఏదో అనుకుంటే ఇంకేదో అవుతున్నట్టుగా బీజేపీ తెలంగాణ వ్యవహరం కన్పిస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో భారీగా సీట్లను గెలుచుకొని సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది. ఇప్పటికే అందరికంటే ముందుగా అభ్యర్థుల్ని ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల్ని చివరి వరకు ఖరారు చేయని పార్టీ, లోక్ సభ విషయంలో మాత్రం ఫుల్ క్లారిటీతో అడుగులు వేస్తోంది. కానీ 8 మంది అభ్యర్థుల్ని ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై పార్టీ మల్లగుల్లాలుపడుతోంది. అభ్యర్థుల సెలక్షన్ విషయం, బిజెపిలో గందరగోళానికి నెలకొంది.

అంతా సాఫీగా సాగిపోతున్న తరుణంలో ఒకే ఒక్క సీటు వ్యవహారం ఇప్పుడు బిజెపికి ఇబ్బందికరంగా మారుతోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించిన సోయం బాపూరావు ఆ తర్వాత వివాదాస్పదం కావడం చూశాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటికీ సిట్టింగ్ లు అందరికీ టికెట్లు ఇస్తారన్న ప్రచారం నడము, సోయం బాపూరావుకు కూడా టికెట్ ఖరారవుతుందని అనుకున్నారు. ఐతే ఆయనకు ఇప్పుడు టికెట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నుంచి 4 స్థానాల్లో విజయం సాధించిన బిజెపి ఈసారి ఆదిలాబాద్ లోక్ సభ స్థానం గెలుచుకోకపోతే ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందని భావిస్తోంది. అందుకే అందులో భాగంగా ఈసారి గట్టి అభ్యర్థిని బరిలో దించాలని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

మాజీ ఎంపీ నగేష్ ను ఆదిలాబాద్ ఎంపీగా బరిలోకి దించితే విజయం నల్లేరుపై నడకని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో పాటు తెలంగాణలో 10 ఎంపీలను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బిజెపి రిస్క్ తీసుకోకూడదని భావిస్తోంది. అందుకే ఇప్పటికే సోయం బాపూరావుకు టికెట్ లేదని చెప్పిన పార్టీ నేతలు తాజాగా ఆ విషయమై ఆదిలాబాద్ నుంచి జి నగేష్ కు టికెట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ఆదిలాబాద్ లో నగేష్ కు టికెట్ కేటాయింపు వ్యవహారం కలకలం రేపుతోంది. మొదట్నుంచి నగేష్ ను బిజెపిలో చేరడాన్ని స్థానిక నేతలు అడ్డుకున్నారు. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే బాపూరావు… నగేష్ ను పార్టీలో చేర్చుకోవద్దని… బిజెపి జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ను కోరారు. ఆయనకు టికెట్ కేటాయించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. అదే సమయంలో నగేష్ చేరిక ద్వారా పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలకు బిజెపి టికెట్ ఖరారు చేసింది. వచ్చే లోకసభ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసేందుకు ఇప్పటికే 9 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన పార్టీ మిగతా అభ్యర్థులను సైతం ఖరారు చేసే పనిలో పడింది.

ఆదిలాబాద్ నుంచి నగేష్ మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్ కు టికెట్లు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డికి టికెట్ కేటాయించే అవకాశం ఉంది. మెదక్ నుంచి రఘునందన్ రావుకు, మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణకు టికెట్ దక్కే అవకాశాలున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.