టీడీపీ నేత అయ్యన్నకు దబిడిదిబిడే…
అనకాపల్లిలో హైటెన్షన్ నెలకొంది. వివాదాస్పద వ్యాఖ్యలకు చిరునామాగా నిలుస్తోన్న టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. తెల్లవారుజామున అయ్యన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. అయ్యన్న ఇంటి గోడను అర్ధరాత్రి మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పంట కాల్వను కబ్జా చేసి గోడ కట్టుకున్నారని మున్సిపల్ అధికారులు తెలిపారు. రెండు సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణం జరిపినట్టు మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. అన్యాయంగా గోడ కూల్చారంటూ అయ్యన్న కుటుంబసభ్యులు… అధికారులతో వాగ్వాదానికి గురయ్యారు. అయ్యన్న ఇంటి పరిసర ప్రాంతాలకు ఎవరూ చేరుకోకుండా పోలీసులు రెండు దారులను మూసేశారు. బారికేట్లు ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు. అయ్యన్నను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమవతున్నారన్న వార్తలతో టీడీపీ కార్యకర్తలు ఆయ నివాసానికి చేరుకుంటున్నారు.
అయ్యన్న గొంతు నొక్కేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందంటూ విరుచుకుపడ్డారు అయ్యన్న పాత్రుడు భార్య పద్మావతి. జనం తరపున మాట్లాడటమే అయ్యన్న చేసిన తప్పా అంటూ ఆమె ప్రశ్నించారు. బీసీలుగా పుట్టడమే నేరమా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ నిలిపివేసి తెల్లవారు జామున కూల్చివేతకు దిగారని… ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా పోలీసులు ఇళ్లు కూల్చివేస్తే ఎక్కడ ఉండాలన్నారు. రాజకీయాలు ఉంటే నేరుగా చూసుకోవాలే కానీ ఆస్తులు ధ్వంసం చెయ్యడం ఏంటన్నారు అయ్యన్న భార్య పద్మావతి. మూడేళ్లుగా ప్రభుత్వం వేధింపులుకు గురిచేస్తోందన్నారు.

