Andhra PradeshHome Page Slider

మొన్నటి వరకు గాంభీర్యం, నేడు అయోమయం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అవటంతో ఆ పార్టీలో పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. వరుస కేసులు అరెస్టులు ఇతర పరిణామాలతో ఆ పార్టీ సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దీనికి తోడు కోర్టులో కొంత ప్రతికూల పరిణామాలు ఎదురవటంతో పార్టీ నేతలు క్యాడర్ అయోమయంలో పడిపోయాయి. ఈ పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించడం అగ్రనాయకత్వానికి ఒక సవాలుగా మారింది. నిస్తేజంగా అయోమయంలో ఉన్న క్యాడర్ ను తిరిగి గాడిలో పెట్టేందుకు చంద్రబాబు నాయుడు కుటుంబం స్వయంగా రంగంలోకి దిగిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటివరకు ఆ పార్టీ యువనేత నారా లోకేష్ కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. లోకేష్ రాజకీయ రంగం ప్రవేశం చేసే నాటికి ఇప్పటికి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. అయినా ప్రస్తుత సంక్షోభం తెలుగుదేశం పార్టీని కొంత ఇబ్బందుల్లోకి నెట్టిన పరిస్థితుల్లో లోకేష్ ధైర్యం కోల్పోకుండా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఇప్పుడు అధికార పార్టీ నేతలు మంత్రులు చేస్తున్న కామెంట్స్ తెలుగుదేశం పార్టీని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి. యువనేత లోకేష్ కూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఇన్నర్ రింగ్ రోడ్డు ఫైబర్ నెట్ కేసుల్లో అరెస్ట్ ఖాయమని వ్యాఖ్యానిస్తుండటంతో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. దీంతో తెలుగుదేశం పార్టీ సీనియర్లంతా ఆలోచనలకు దిగారు. తాజా పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తొలిసారి రాజకీయ ముఖచిత్రం పైకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో భువనేశ్వరి బుధవారం భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీని రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని నాయకులకు నొక్కి చెప్పారు. చంద్రబాబుకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సూచించారు.

గడిచిన 40 ఏళ్లుగా ఏనాడు రాజకీయ సభలు సమావేశాలు పార్టీ కార్యక్రమాలకు హాజరుకాని ఆమె తాజాగా రాజమండ్రిలో పార్టీ నేతలతో బేటి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ ట్రస్ట్ కార్యక్రమాలతో పాటు ఇతర కుటుంబ వ్యాపారాలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఆమె ప్రత్యక్షంగా సీనియర్ నేతలతో భేటి కావడం చర్చకు దారి తీసింది. తాజాగా రాజమండ్రిలో చంద్రబాబు అరెస్ట్, బెయిల్ కేసులు కొట్టివేత, అంశాల్లో ఉన్న ఇబ్బందులు ఇతర సాంకేతిక సమస్యలపై చర్చించడమే కాకుండా పార్టీ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏదిఏమైనప్పటికీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బయటికి వస్తే ఆయన వ్యవహార శైలి భిన్నంగా ఉంటుందని ప్రత్యర్థుల ఎత్తులకు పైయత్తులు వేసి పార్టీకి,నేతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని నమ్మకం మాత్రం ఆ పార్టీలో కనిపిస్తుంది.