జగన్ టార్గెట్‌గా చంద్రబాబు భారీ స్కెచ్
◆ ఎన్నికలకు రెడీ అంటున్న టీడీపీ
◆ ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న చంద్రబాబు
◆ సమగ్ర కార్యాచరణతో ముందుకు
◆ సీనియర్ నేతల వారసుల అంశంలో కఠిన నిర్ణయాలు
◆ ఒక కుటుంబానికి ఒక్క సీటు దిశగా అడుగులు
◆ ఈసారి ఎన్నికల్లో బాలకృష్ణ, నారా లోకేష్‌లకు టికెట్లు ఇస్తారా?
ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికలు వచ్చినా గట్టి పోటీ ఇచ్చి ఎదురు నిలబడేలా ఇప్పటినుంచే చంద్రబాబు నాయుడు వ్యూహాలు అమలు చేస్తున్నారు. రాజకీయాల్లో తనకు ఉన్న సుదీర్ఘ అనుభవంతో ఇప్పటి నుండే ప్రణాళికలు రూపొందిస్తూ, పార్టీ పటిష్టత కోసం అంశాల వారీగా చర్చలు జరిపి సరికొత్త అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు. పొత్తులు సంగతి ముందు ముందు ఎలా ఉన్నా తమ పార్టీ నాయకులు కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఎన్నికలకు ఎంతో సమయం లేదని దూకుడు పెంచాలని కార్యకర్తలకు నాయకులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. వచ్చే ఏడాది కాలం తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమని ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త తమ అలసత్వం వీడి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆయన అంటున్నారు. రెండు రోజుల క్రితం ఆయా నియోజకవర్గాల పార్టీ ఇన్చార్జిలతో సమీక్ష సమావేశాలు జరిపి వివిధ అంశాలు, నాయకుల పనితీరుపై చర్చలు జరిపి వారికి పలు సూచనలు కూడా చేశారు. పార్టీ ఏ పిలుపు ఇచ్చిన ఆ కార్యక్రమాలకి స్థానిక నాయకత్వం పాల్గొనేలా స్థానికంగా ఉన్న సమస్యలపై కూడా చురుగ్గా పోరాటాలు జరిపేలా సరైన ప్రణాళిక రూపొందించుకొని ప్రజల్లోకి వెళ్లాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. మరోవైపు పార్టీలో కూడా మార్పులు చేర్పులుకు చంద్రబాబు తెర తీశారు.

పార్టీ పరంగా ఏమి లోటుపాట్లు ఉన్నాయి ఇంకా ఏమీ మార్పులు చేయాలి, లాంటి అంశాలపై పలువురు నేతల నుండి అవసరమైన సలహాలు సూచనలు కూడా ఆయన తీసుకుంటున్నారు. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని చంద్రబాబు తహతహతలాడుతున్నారు. గతంలో అసెంబ్లీ టికెట్లు కేటాయింపులో జరిగిన పొరపాట్లు తప్పిదాలను సరిచేసుకొని వారసత్వ రాజకీయాల అంశంలో కూడా ఏ పార్టీ చేయని విధంగా సరికొత్త విధానానికి చంద్రబాబు బీజం వేస్తారని తెలుస్తోంది. ఎంత కుటుంబ చరిత్ర ఉన్న వారసత్వ రాజకీయాలు సరికాదని సీనియర్ నేతలు కు ఆయన సూచిస్తున్నారు. ఈసారి ఎన్నికలకు కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్లు కేటాయింపు ఉంటుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో ఎన్నో సంవత్సరాలుగా పార్టీని అంటిపెట్టుకొని పార్టీ కోసం కష్టపడుతున్న ఎంతోమంది ఆశావాహులు లో ఆశలు చిగురించాయి. ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం తమకు లభిస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఎన్నికలలో గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని టిడిపి అధినేత భావిస్తుండటంతో కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది నేతలు వారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో సర్వేలు చేయించిన చంద్రబాబు తన సొంత అనుచరగణం ద్వారా నివేదికలకు తెప్పించుకుని ప్రతి నియోజకవర్గాన్ని చాలా కీలకంగా భావిస్తూ సరైన అభ్యర్థికే టికెట్లు కేటాయిస్తారని గుసగుసలు వినపడుతున్నాయి.

ఒంగోలులో జరిగిన మహానాడు తర్వాత జోష్ లో ఉన్న చంద్రబాబు ఏపీలో జనసేన బిజెపితో పొత్తు కలిసిన కలవకపోయినా జగన్ నీ మాత్రం గద్దె దింపాలని కృత నిశ్చయంతో ముందుకు వెళ్తున్నారు. మరి ఒకే కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే అంటున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో సీనియర్ నేతల వారసులు పార్టీలు మారవచ్చు అనే అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చింది. అన్నిచోట్ల సీనియర్ నేతలకు మాత్రం టికెట్ ఇచ్చి వారి వారసులకి వారి కుటుంబ సభ్యులకు టికెట్లు కేటాయించని పక్షంలో చంద్రబాబు కుటుంబంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించకపోతే ఇబ్బందులు తలెత్తుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు నాయుడు కుటుంబంలో ఆయన బావమరిది హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తారా వారసత్వ రాజకీయాలు వద్దు కుటుంబానికి ఒక్క టికెట్ అనే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబు తన ఇంటి నుండి ఈ ప్రక్షాళనకు అడుగులు మొదలు పెడతారా సీనియర్ టిడిపి నాయకుల ఒత్తిడికి తలోగ్గి మరలా వారి వారసులకు టికెట్లు కేటాయిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.