Andhra Pradesh

టార్గెట్ ఫిక్స్… రంగంలోకి చంద్రబాబు

◆ ఏపీలో అన్ని పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు
◆ ఈసారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయింపు
◆ బీసీ సామాజిక వర్గాల ఓటర్లపై పార్టీల గురి
◆ ఉన్నతాదాయవర్గాలు, తటస్థ ఓటర్లపై టీడీపీ దృష్టి
◆ అన్ని పార్టీలకు ఈసారి ఎన్నికలు అత్యంత కీలకం
◆ ఏడాదిన్నర ముందే కాక పుట్టిస్తున్న రాజకీయ వేడి

ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఏడాదిన్నరకు ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ వేడి మొదలైంది. వర్షాకాలంలోనూ వేడి పుట్టిస్తున్న ఎండల మాదిరిగానే ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో కొంత మందిని మార్చి ఆయా నియోజకవర్గాలలో గెలుపు గుర్రాల కోసం అన్వేషణ చేస్తోండగా, టీడీపీ మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు కేటాయిస్తామంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. వివిధ వర్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్న పార్టీలు సర్వేల నివేదికల ఆధారంగా ఎన్నికలకు సంవత్సరం ముందే అభ్యర్థులను ప్రకటించేలా కసరత్తులు చేస్తున్నాయి. అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రం గ్రాఫ్ భయం వెంటాడుతుంది. వచ్చే ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే సీట్లు ఉంటాయని ఇప్పటికే సీఎం జగన్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

వైసీపీ ఇప్పటికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు అత్యంత చేరువయ్యే విధంగా కృషి చేస్తోంది. అలానే టీడీపీ కూడా బాదుడే బాదుడు కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విధానాలను ఎండగడతూ వస్తోంది. ఇక జనసేన బీజేపీలు వారి వారి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో కొంతమేర గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. వివిధ వినూత్న కార్యక్రమాలతో ప్రజలకు చేరువవుతూ, అభ్యర్థుల ఎంపికపై దృష్టి కేంద్రీకరిస్తోండటంతో పాటు రాజకీయ పార్టీలు ఈసారి ఎన్నికల్లో గెలవాలంటే ఏమి చేయాలనే ఆలోచనలో పడ్డాయి. ఏ పార్టీ కైనా గెలుపోటములను నిర్ణయించేది ఆయా పార్టీలకు ప్రధాన ఓటు బ్యాంకింగ్‌తో పాటు తటస్థ ఓటర్లే. గతంలో పార్టీలు తటస్థ నేతల కోసం ప్రయత్నాలు చేసేవి.. కానీ ఇప్పుడు పార్టీలు తటస్థ ఓటర్ల లెక్కలు వేసుకుంటున్నాయ్.

ఈసారి జరిగే హోరాహోరీ ఎన్నికల్లో అసలు ఓటర్లలో తమకు అనుకూలంగా ఉండే వారెవరు తటస్థంగా ఉండే వారెవరు, దూరంగా ఉండే వారెవరు, ఒకవేళ ఉంటే ఎందుకు దూరంగా ఉంటున్నారు, తటస్థ ఓటర్లను తమ తమ పార్టీల వైపు ఎలా తిప్పుకోవాలి తదితర అంశాలపై ఇప్పటికే పార్టీలు దృష్టి కేంద్రీకరించాయి. ఈసారి ఎన్నికలలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్న తెలుగుదేశం పార్టీ ప్రధానంగా బీసీ ఓటర్లను, తటస్థ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల లబ్ధిదారులంతా తిరిగి వైసీపీకి ఓటు వేస్తారనే నమ్మకంతో ఆ పార్టీ ఉంది. వివిధ పథకాల వల్ల లబ్ధి పొందిన వారు ఈసారి ఎన్నికల్లో వైసీపీని కాదని తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారా లేదా అనే ఆలోచనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి, ఉన్నత వర్గాలు తటస్థ ఓటర్లపై దృష్టి సారించింది.

ఈసారి ఎన్నికల్లో ఉన్నత ఆదాయ వర్గాలను ఎగువ మధ్య తరగతి వర్గాల ఓటింగ్ శాతం పెంచగలిగితే టీడీపీ విజయం ఖాయమని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల టీడీపీ రివ్యూల్లో ఇదే విషయాన్ని చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేస్తున్నారు. ఒక్కో ఓటు విలువను అర్థమయ్యేలా చెప్పి… ఈసారి ఏ ఒక్క అవకాశాన్ని వదలొద్దంటూ నేతలకు సూచిస్తున్నారు. ఈ విషయాలను నియోజకవర్గ నేతలతో సమావేశమైనప్పుడల్లా వారికి పదేపదే చెబుతున్నారు. అలానే మధ్యతరగతి ప్రజలను టీడీపీ వైపునకు తిప్పుకోవాలని వీరికి రాష్ట్ర రాజకీయాలపై పూర్తి అవగాహన ఉంటుందని ధరలు పెరిగిన పథకాల ఆగిపోయిన మొదటగా ఇబ్బందులు ఎదుర్కొనేది మధ్యతరగతి వారేనని వారిని టీడీపీ వైపు తిప్పుకోడానికి ప్రణాళికలు అమలు చేయాలని పార్టీ నేతలుకు సూచిస్తున్నారట చంద్రబాబు.

ఓవైపు టీడీపీ అడుగులను నిశితంగా గమనిస్తున్న వైఎస్ జగన్… తనకు పక్కాగా బాసటగా నిలిచే ఓటర్లెవరు… ఏ నియోజకవర్గంలో లోటు ఉందన్నదానిపై కీలక నేతలతో రివ్యూ చేస్తున్నారు. అందుకోసమే నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే నాయకులు ఎవరైనా… వారి స్థాయి ఎంతైనా సరే పార్టీలోకి లాగేందుకు ప్రయత్నించాలని నేతలకు ఇప్పటికే క్లియర్ ఇండికేషన్లు ఇచ్చేశారు. ముఖ్యంగా టీడీపీ అగ్రనేత లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీలో ఉన్న నేతలందరినీ… వైసీపీలోకి లాగేశారు. నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తే… టీడీపీని బలహీనం చేయొచ్చని భావిస్తున్నారు. కానీ నేతలు వస్తే ఓటర్లు మారతారా… అన్న ప్రశ్న రాజకీయ పార్టీలను అనాధిగా వేధిస్తూనే ఉంది. రానున్న ఎన్నికలు అన్ని పార్టీలకు అత్యంత కీలకం కావడంతో ఏ ఒక్క అంశాన్ని వదలకుండా నిశితంగా పరిశీలిస్తూ రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నాయి. మరి ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో చూడాల్సి ఉంది.