Home Page SliderTelangana

ఢిల్లీ జైల్లో రెయిడ్స్, అధికారులు షాక్

కోట్లాది రూపాయల లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అధికారుల ముందు బోరున విలపించాడు. సీసీటీవీ ఫుటేజ్ విజువల్స్‌లో సుకేష్ ఆవేదనగా కన్పించాడు. జైలు అధికారులు ఢిల్లీలోని అతని జైలును ఆకస్మికంగా తనిఖీ చేయడంతో గది నుండి లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మండోలి జైలులోని సుకేష్ జైలు గదిలో ₹ 1.5 లక్షల నగదు, గుక్కీ చెప్పులు, ₹ 80,000 విలువైన రెండు జతల జీన్స్‌లు పోలీసులు కనుగొన్నారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి చేసిన జైలర్ దీపక్ శర్మ, మరొక అధికారి ముందు సుకేష్ తన సెల్ మూలన నిల్చొని ఏడ్వడం సీసీటీవీ ఫుటేజీ ద్వారా బయటకు వచ్చింది. ₹ 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుకేష్… కొన్ని రోజులుగా జైల్లో ఉన్నాడు. ఈ కేసులో బాలీవుడ్ నటులు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, నోరా ఫతేహీలను పోలీసులు ప్రశ్నించారు. గత వారం, రిలిగేర్ మాజీ ప్రమోటర్ మల్విందర్ సింగ్ భార్యను మోసం చేసిన మనీలాండరింగ్ కేసులో సుకేష్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అరెస్టు చేసింది. మల్విందర్ సింగ్‌ను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు ₹ 3.5 కోట్లకు పైగా సుకేష్ తీసుకున్నట్టుగా ఆమె ఆరోపించారు.