NewsTelangana

ఐటీ కారిడార్‌లో ప్రత్యేక బస్సులు

హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైటెక్‌ సిటీ, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లోని ఐటీ కారిడార్‌లో ప్రత్యేక షటిల్‌ బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వ్యక్తిగత వాహనాలతో ట్రాఫిక్‌లో ఇబ్బంది పడకుండా షటిల్‌ సర్వీసుల ఏర్పాటు చేశామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఐటీ ఉద్యోగుల నుంచి ఆన్‌లైన్‌లో సర్వే చేసి.. వారి అభిప్రాయం మేరకు భవిష్యత్తులో మరిన్ని షటిల్‌ సర్వీసులు నడుపుతామని చెప్పారు. తక్కువ సమయంలో, సురక్షితంగా గమ్యస్థానాలకు పంపించడమే ఈ షటిల్‌ లక్ష్యమన్నారు.

ప్రత్యేక యాప్‌లో వివరాల నమోదు..

ఈ షటిల్‌ సర్వీసులను వినియోగించుకోవాలనుకునే వారు ప్రత్యేక యాప్‌లో ‘షార్ట్‌యూఆర్‌ఎల్‌.ఏటీ/ఏవీసీహెచ్‌ఐ’ అనే లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని ఆర్టీసీ అధికారులు సూచించారు. ఉద్యోగులు తమ కంపెనీ వివరాలు, లొకేషన్‌, పికప్‌, డ్రాపింగ్‌ ప్రాంతాలను తప్పనిసరిగా నమోదు చేయాలని.. విలువైన సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక యాప్‌లో టికెట్‌ బుకింగ్‌ సదుపాయం, సర్వీసులకు ట్రాకింగ్‌ సదుపాయం ఉన్నాయి. యాప్‌లో సర్వీసు నెంబరు, డ్రైవర్‌, కండక్టర్‌ ఫోన్‌ నెంబర్లు, ఇతర వివరాలూ ఉంటాయి.