NewsTelangana

‘ఎమ్మెల్యేలకు ఎర’పై సిట్‌ స్పీడ్‌.. 5 రాష్ట్రాల్లో తనిఖీ

‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తును సిట్‌ బృందం వేగవంతం చేసింది. నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ నేతృత్వంలోని సిట్‌ అధికారులు తెలంగాణ సహా కర్నాటక, హర్యానా, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో తనిఖీలను తీవ్రతరం చేశారు. కేరళలోని కొచ్చిలో రామచంద్ర భారతికి, తుషార్‌కు సన్నిహిత మిత్రుడైన వైద్యుడి ఆస్పత్రిలో సిట్‌ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సమాచారం అందుకున్న వైద్యుడు అక్కడి నుంచి జారుకున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. హర్యానా, కర్నాటకలోని రామచంద్ర భారతి నివాసాల్లో.. తిరుపతిలోని సింహయాజీ స్వామీజి ఆశ్రమంలోనూ పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

నందు అక్రమ కట్టడాల కూల్చివేత..

తిరుపతి నుంచి సింహయాజీ హైదరాబాద్‌ వచ్చేందుకు ఓ జాతీయ పార్టీ నేత బంధువు టికెట్‌ బుక్‌ చేసినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. మరో నిందితుడు నందకుమార్‌కు చెందిన అక్రమ కట్టడాలను జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చి వేశారు. నిర్మాత దగ్గుపాటు సురేష్‌ బాబు స్థలాన్ని లీజుకు తీసుకున్న నందకుమార్‌ ఫిలింనగర్‌లోని దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ ప్రాంగణంలో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు అక్రమ నిర్మాణాలు చేపట్టారు. దీనిపై నిర్మాత సురేష్‌ బాబు ఫిర్యాదు చేయడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చి వేత కార్యక్రమాన్ని చేపట్టారు. ‘ఎమ్మెల్యేలకు ఎర’ ఉదంతంలో 23 మందితో కూడిన ముఠా పని చేసిందని కేసీఆర్‌ చెప్పారు. వీళ్లు ఎవరు..? ఎక్కడెక్కడ ఉంటారు..? వాళ్లను ఎలా పట్టుకొస్తారు..? అనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.