Home Page SliderInternational

అమెరికాలో కుప్పకూలిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)

2008 తర్వాత అతిపెద్ద బ్యాంకింగ్ వైఫల్యం
టెక్నాలజీ స్టార్టప్‌లకు రుణాలు ఇవ్వడంలో పాపులర్
భారీగా పడిపోయిన గ్లోబల్ మార్కెట్లు
తీవ్రంగా దెబ్బతిన్న బ్యాంకింగ్ షేర్లు

అతిపెద్ద టెక్నాలజీ స్టార్టప్‌లకు రుణాలు ఇవ్వడంలో పేరుగాంచిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ శుక్రవారం కుప్పకూలింది. కాలిఫోర్నియా బ్యాంకింగ్ రెగ్యులేటర్లు శుక్రవారం సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను మూసేశారు. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత ఇదే అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ వైఫల్యం. అమెరికా రెగ్యులేటర్లు శుక్రవారం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (SVB)ని మూసివేసి, డిపాజిట్ల చెల్లింపుపై నియంత్రణను తీసుకున్నారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం తర్వాత అతిపెద్ద రిటైల్ బ్యాంకింగ్ వైఫల్యమని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.

బ్యాంక్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న 48 గంటల తర్జనభర్జనల నడుమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కస్టమర్లు డిపాజిట్లు ఏమైపోతాయన్న ఆందోళనతో షేర్ ధర భారీగా క్షీణించింది. టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా భారీ సంపదను ఆర్జించిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ తన ఆస్తులలో ఎక్కువ భాగం US బాండ్లలో పెట్టుబడి పెట్టింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి, గత సంవత్సరం ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించడంతో బాండ్ విలువలు భారీగా తగ్గాయి.

కోవిడ్ మహమ్మారి తర్వాత స్టార్టప్ ఫండింగ్ కూడా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఫలితంగా బ్యాంక్ ఖాతాదారులు అధిక సంఖ్యలో డబ్బును విత్‌డ్రా చేసుకున్నారు. వారి అభ్యర్థనలను గౌరవించడం కోసం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వాటి విలువ క్షీణించినప్పటికీ కొన్ని పెట్టుబడులను విక్రయించవలసి వచ్చింది. ఈ వారం ప్రారంభంలో బ్యాంక్ దాదాపు $2 బిలియన్లను బ్యాంక్ కోల్పోయింది. బ్యాంక్ మూసివేయబడిన తర్వాత, దాదాపు $175 బిలియన్ల కస్టమర్ డిపాజిట్లను… ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ FDIC నియంత్రణలోకి వెళ్లాయి.

SVB కుప్పకూలిన తర్వాత… FDIC, నేషనల్ బ్యాంక్ ఆఫ్ శాంటా క్లారా అనే కొత్త బ్యాంక్‌ను సృష్టించింది. ఇది ఇప్పుడు సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అన్ని ఆస్తులను టేకోవర్ చేస్తోంది. డిపాజిటర్లకు భరోసా ఇస్తూ, సోమవారం ఉదయం బ్యాంకులోని అన్ని శాఖలు తెరిచిన తర్వాత FDIC ప్రకటన విడుదల చేసింది. పాత బ్యాంకు చెక్కులను కూడా గౌరవిస్తామని హామీ ఇచ్చింది. SVB ఆకస్మికంగా మూసేయడంతో సిలికాన్ వ్యాలీ వ్యవస్థాపకులు నిరాశకు గురయ్యారు. వాషింగ్టన్‌లో, బైడెన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు రెగ్యులేటర్‌లపై “పూర్తి విశ్వాసాన్ని” వ్యక్తం చేశారు. కష్టమర్లకు ఎలాంటి ఇబ్బంది కలక్కుండా చూసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.