Telangana

రైలు కిందపడి ఎస్‌ఐ ఆత్మహత్య

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఎస్‌ఐ రమణ ఆత్మహత్య చేసుకున్నారు. 2020 బ్యాచ్‌కు చెందిన ప్రొబెషనరీ ఎస్‌ఐ బుధవారం రాత్రి మల్కాజిగిరి పరిధిలోని మౌలాలి రైల్వే ట్రాక్‌పై తల పెట్టి బలవన్మరణానికి పాల్పడ్డారు. గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌ వెంట వెళ్లిన స్థానికులు చెల్లాచెదురుగా పడి ఉన్న ఎస్‌ఐ రమణ శరీర భాగాలను చూసి భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహం వద్ద దొరికిన ఆధారాలతో మృతుడిని ట్రాఫిక్‌ ప్రొబెషనరీ ఎస్‌ఐ రమణగా గుర్తించారు. ప్రేమ వైఫల్యం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రమణ మరో ఎస్‌ఐ ప్రతాప్‌, ముగ్గురు స్నేహితులతో కలిసి చిక్కడపల్లి అశోక్‌నగర్‌లో నివసిస్తున్నారు. బుధవారం రాత్రి 10 గంటల సమయంలో పని ఉందంటూ బయటికి వెళ్లారని రమణ స్నేహితులు చెప్పారు.