సోనియాతో భేటీ విషయాలు పార్టీలో షర్మిల చర్చించలేదు
కాంగ్రెస్‌లో విలీనానికి సంబంధించిన ఊహాగానాలు
సోనియా గాంధీని కలిసిన వైఎస్ షర్మిల
వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయనున్నారనే ఊహాగానాల మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సోదరి వైఎస్ షర్మిల గురువారం దేశ రాజధానిలో ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలిశారు. పొరుగు రాష్ట్రంలో పార్టీ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపేందుకు షర్మిల బెంగుళూరులో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి కె శివకుమార్‌ను మే నెలలో కలిసిన తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారనే ఊహాగానాలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి.

సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సమావేశం తర్వాత షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని అవి వచ్చే ఎన్నికలేనని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ పార్టీతో నిర్మాణాత్మక చర్చలు జరిగాయని, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె తెలంగాణ ప్రజలకు మేలు చేసేందుకు నిరంతరం కృషి చేస్తుందని ఆమె చెప్పారు. సోనియా, రాహుల్ గాంధీతో సమావేశం తర్వాత విలేకరులతో మాట్లాడుతూ షర్మిల చెప్పారు.

మొత్తం వ్యవహారంపై వైఎస్సార్టీపీ అధికార ప్రతినిధి కొండా రాఘవ రెడ్డిని సంప్రదించగా, ఆమె ఢిల్లీ పర్యటన వివరాలు, సోనియా గాంధీతో భేటీ అంశాలు వైయస్ఆర్టీపీ నాయకులకు లేదా క్యాడర్ ఎవరికీ తెలియదని అన్నారు. పార్టీని నమ్మి వచ్చినవారిని నట్టేట ముంచుతారా అంటూ పలువురు నేతలు మండిపడుతున్నారు. తమకు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇబ్బంది లేదని, ఎన్నికల్లో టికెట్ మాత్రం ఇవ్వాల్సిందేనంటున్నారు. తెలంగాణాలోని పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని షర్మిల గతంలోనే ప్రకటించారు.

