తెలంగాణా కొత్త సీఎస్‌గా శాంతి కుమారి
తెలంగాణా నూతన ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి నియమితులయ్యారు. దీనికి సంబంధించి తెలంగాణా ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శాంతికుమారి 1989 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఆమె సీఎం కార్యాలయంలో పనిచేశారు. ఆమె 2025 ఏప్రిల్ వరకు తెలంగాణా రాష్ట్రానికి సీఎస్‌గా కొనసాగనున్నారు. అంటే దాదాపు రెండున్నర సంవత్సరాలపాటు ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు.ప్రస్తుతం ఆమె అటవీశాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతంలో ఆమె వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అంతేకాకుండా శాంతికుమారి ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాలకు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. శాంతి కుమారి తెలంగాణా మొదటి మహిళ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.

ఎంతో నమ్మకంతో తెలంగాణా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాకు అవకాశం ఇవ్వడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సీఎస్ శాంతి కుమారి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై ఉంచిన ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి నా శాయశక్తులా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలతోపాటు అన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల అమలులో సహచర అధికారులతో సమన్వయంతో, ప్రజాప్రతినిధుల సహకారంతో విజయవంతంగా అమలు చేసేలా చూస్తానన్నారు.