NationalNews

కీచులాటలు, దోబూచులాటలు.. ఇదీ కాంగ్రెస్‌ దుస్థితి

ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. రెండేళ్లలో పార్లమెంటు ఎన్నికలు.. రాష్ట్రంలోనూ, దేశంలోనూ అప్పుడే రాజకీయాలు హీటెక్కాయి. ఇటు కేసీఆర్‌.. అటు మోదీ ఎన్నికల నగారా మోగించేశారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇంకా కీచులాటలు, కుమ్ములాటలు, దోబూచులాటల మధ్యే కాలం గడుపుతోంది. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో అధ్యక్షుడినే ఎన్నుకోలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోంది.

కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్య కారణాలతో పార్టీకి సమయం ఇచ్చే పరిస్థితిలో లేరు. యువ నాయకుడైన రాహుల్‌గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టేందుకు ససేమిరా అంటున్నారు. పార్టీలో ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ప్రియాంక గాంధీకి సారథ్య బాధ్యతలు అప్పగిస్తే సమర్ధవంతంగా నిర్వహించగలరా? అని సీనియర్ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దశాబ్దాల తరబడి పదవులు నిర్వహించిన చిదంబరం, కమల్‌నాథ్‌, గులాం నబీ ఆజాద్‌, జైరాం రమేశ్‌, దిగ్విజయ్‌ సింగ్‌, అశోక్‌ గెహ్లోత్‌ వంటి ఉద్ధండ నాయకులు మౌన వ్రతం వీడటం లేదు. అమరీందర్‌ సింగ్‌, జ్యోతిరాదిత్య సింధియా వంటి మరికొందరు సీనియర్లు పరిస్థితిని అంచనా వేసి బీజేపీలోకి వెళ్లిపోయారు. ఈ స్థితిలో నాయకులనందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్‌ను కాపాడుకోగలిగే సారథి కనుచూపు మేరలో కనిపించడం లేదని ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. ఈ దోబూచులాటల మధ్యే లోక్‌సభ ఎన్నికల పుణ్యకాలం కాస్తా గడిచిపోతుందని భయపడుతున్నారు.

తెలంగాణ రాష్ట్రంలోనూ పార్టీ పరిస్థితి అంతే దయనీయంగా ఉంది. ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ జిత్తుల ముందు రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకుల ఎత్తుగడలు పని చేయడం లేదు. ఈ దశలో పార్టీ సారథ్య బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డికి సీనియర్ల నుంచి వ్యతిరేకతే వ్యక్తమవుతోంది. మునుగోడు ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపికపైనా పార్టీ నాయకులు ఒక్క మాటపై నిలబడలేక పోతున్నారు. రేవంత్‌ రెడ్డి రియల్టర్‌ కృష్ణారెడ్డికి కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వాలని భావిస్తుంటే.. సీనియర్‌ నాయకులు మాత్రం పాల్వాయి స్రవంతిని నిలబెట్టాలని వాదిస్తున్నారు. రేవంత్‌ ఒంటెత్తు పోకడలు పార్టీకి నష్టం చేస్తున్నాయని సీనియర్లు ఏకంగా సోనియా నివాసంలోనే పంచాయితీ పెట్టారు. దీంతో రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో దూసుకెళ్తుంటే కాంగ్రెస్‌ నాయకులు మాత్రం కీచులాటలు, కుమ్ములాటలతో ప్రజల్లో చులకన అవుతున్నారు.