ఆప్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సందీప్ పాఠక్
ఆమ్ ఆద్మీ పార్టీ సందీప్ పాఠక్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీఏసీకి సందీప్ శాశ్వత ఆహ్వానితుడిగా కూడా ఉంటారు. సందీప్ పాఠక్ పంజాబ్, గుజరాత్‌లకు పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. “ఆమ్ ఆద్మీ పార్టీ దీని ద్వారా డాక్టర్ సందీప్ పాఠక్‌ను రాష్ట్రీయ సంఘటన్ మహామంత్రి (జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్)గా నియమిస్తుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC)కి శాశ్వత ఆహ్వానితుడిగా కూడా ఉంటాడు” అంటూ ప్రకటన విడుదల చేసింది. పాఠక్ ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)లో ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా సందీప్ పాఠక్‌ను కేజ్రీవాల్ అభినందించారు. దేశంలోని మూల మూలకు ఆప్ పార్టీని తీసుకెళ్లాలని కేజ్రీవాల్ ట్వీట్లో పేర్కొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ ఎన్నికల్లో ప్రభావం చూపించకపోయినప్పటికీ ఆ పార్టీ సుమారుగా 13 శాతం ఓట్లను రాబట్టగలిగింది. భారీగా ఓట్లతోపాటు, ఐదు సీట్లను సంపాదించింది. భారీగా ఓట్లను రాబట్టడం వల్ల ఆప్ జాతీయ పార్టీ హోదాను పొందింది. AAP ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాలు సాధించి, రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. జాతీయ పార్టీగా ఉండటానికి ఎన్నికల సంఘం నియమ నిబంధనలను ఆప్ పొందింది. డిసెంబర్ 18న జరగనున్న ఆప్ జాతీయ కౌన్సిల్ సమావేశానికి ముందు ఈ ప్రకటన వెలువడింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర పార్టీ సీనియర్ నాయకులు ఈ సమావేశాల్లో పాల్గొంటారు. గుజరాత్, గోవా, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాలకు చెందిన మొత్తం 10 మంది రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉంది.